ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌లో భారత్ శుభారంభం

SMTV Desk 2019-07-17 12:35:16  indonesia open 2019

ఇండోనేసియా ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-1000 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత ఆటగాళ్ళు శుభారంభం చేశారు. మంగళవారం ప్రారంభమయిన ఈ టోర్నీలో మిక్స్‌డ్ డబుల్స్ తొలి రౌండ్‌లో సిక్కిరెడ్డి, ప్రణవ్ జెర్రీ చోప్రా ద్వయం 25-23, 16-21, 21-19 తేడాతో రాబిన్ తాబెలింగ్, సెలీనా పీక్‌ (నెదర్లాండ్ )పై విజయం సాధించారు. తొలి గేమ్‌ను 25-23తో దక్కించుకున్న ఈ జోడీ.. రెండో గేమ్‌ను చేజార్చుకుని నిర్ణయాత్మక ఆఖరి గేమ్‌లో పుంజుకుని మ్యాచ్‌ను గెలిచింది. తర్వాతి రౌండ్‌లో చైనాకు చెందిన టాప్ సీడ్ జోడీ జెంగ్ సీ వీ, హువాంగ్ యా క్వింగ్‌తో ప్రణవ్, సిక్కిరెడ్డి పోటీ పడతారు.మహిళల డబుల్స్‌లో భారత్‌కు నిరాశ ఎదురైంది. భారత జోడీ అశ్వినీ పొన్నప్ప, సిక్కిరెడ్డి 20-22, 22-20, 20-22 తేడాతో మలేషియా జోడీ వివియన్ హూ, యప్ చెంగ్ వెన్ చేతిలో పోరాడి ఓడింది. 75 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో మూడో గేమ్‌లో సిక్కి ద్వయం 20-19తో విజయానికి పాయింట్‌ దూరంలో నిలిచింది. అయితే మలేసియా జోడీ మ్యాచ్‌ పాయింట్‌ కాపాడుకోవడంతో పాటు వరుసగా మూడు పాయింట్లు గెలిచి విజయాన్ని సొంతం చేసుకుంది.పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాత్విక్ సాయిరాజ్ రాంకీ రెడ్డి, చిరాగ్ శెట్టి ద్వయం 21-19, 18-21, 21-19 తేడాతో మలేషియా జోడీ గో జే ఫీ, నూర్ ఇజుద్దీన్‌పై విజయం సాధించింది. రెండో రౌండ్‌లో ఇండోనేషియన్ జోడీ ఫెర్నాల్డీ గిడియోన్, సంజయ సుకముల్జోతో సాత్విక్-చిరాగ్ ద్వయం తలపడనుంది.