ఓటర్లకు డబ్బులు పంచారని హీరో బాలకృష్ణపై పిటిషన్...

SMTV Desk 2017-08-30 11:11:19  Nandamuri Balakrishna, Nandyala by-polls, YSRCP, Money for Vote allegation, High Court

నంద్యాల, ఆగస్ట్ 30: ఇటీవల నంద్యాల ఉపఎన్నికలను అధికార, ప్రతిపక్షాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఎన్నికల్లో అధికార పక్షం ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల ప్రచారంలో ప్రముఖులంతా పాల్గొనగా నంద్యాల రణరంగాన్ని తలపించింది. ఈ నేపధ్యంలో ప్రముఖ సినీ నటుడు, తెదేపా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ప్రచారం నిర్వహించారు. అయితే బాలకృష్ణ ఓటర్లను ప్రలోభపెట్టడానికి బహిరంగంగా డబ్బులు పంచారని వైకాపా ఆరోపించింది. ఈ దీనిపై ఈసీ చర్యలు తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేయాలంటూ వైకాపా ప్రధాన కార్యదర్శి కే శివకుమార్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. కాగా, ఈ పిటిషన్‌లో ప్రతివాదులుగా కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, నంద్యాల రిటర్నింగ్ అధికారి, బాలకృష్ణలను ఆయన పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టాలని బాలకృష్ణ చూశారని, డబ్బు పంచుతున్న దృశ్యాలు మీడియాలో వచ్చాయని తెలిపారు టీవీ ఛానళ్లు వీడియోలు చూపగా, పత్రికలు ఫోటోలను ప్రచురించాయని, ఈ విషయమై ఇంతవరకూ కేసు నమోదు కాలేదని వెల్లడించారు. కాగా, ఈ సంఘటన పై ఎన్నికల అధికారి భన్వర్ లాల్ విచారణ చేయగా ప్రచారంలో బాలకృష్ణ పంచింది డబ్బు కాదని, కరపత్రాలు మాత్రమేనని కలెక్టర్ నివేదిక పంపినట్లు ఇటీవల ఈసీ ఒక ప్రకటనలో తెలిపారు.