స్మోకింగ్ మానేయాలనే ప్రయత్నంలో కన్న బిడ్డను కోల్పోయిన మహిళ!

SMTV Desk 2019-07-11 14:54:24  Melbourne boy dies after drinking mums liquid nicotine

ఓ తల్లి తన స్మోకింగ్ అలవాటును మానేయాలని చేసిన ప్రయత్నంలో తన బిడ్డను కోల్పోయింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌కు చెందిన మహిళ తన స్మోకింగ్ అలవాటును మానేయాలని నిర్ణయించుకుంది. ఈ సందర్భంగా ఆమె లిక్విడ్ నికోటిన్ కొనుగోలు చేసింది. దాన్ని వేప్ జ్యూస్‌లో కలిపి ఈ-సిగరెట్ ద్వారా స్మోకింగ్ చేయడం అలవాటు చేసుకుంది. ఆమె ఉద్దేశం మంచిదే అయినా చిన్న పొరపాటు వల్ల 19 నెలల బిడ్డనే కోల్పోవలసి వచ్చింది. లిక్విడ్ నికోటిన్ కలిపిన వేప్ జ్యూస్ బాటిళ్లను బయట వదిలపెట్టి ఇంట్లో పనులు చేసుకుంటుండగా.. చిన్నారి వాటిని తాగేశాడు. అయితే, ఈ విషయాన్ని ఆమె వెంటనే గుర్తించలేదు. బాటిళ్లను వేరే చోట పెట్టేందుకు సిద్ధమవుతుండగా ఒక బాటిల్ కనిపించలేదు. దీంతో కంగారు పడిన ఆమె చిన్నారి వద్దకు వెళ్లి చూడగా ఒక బాటిల్ నోటిలో ఉంది. కొద్దిసేపటి తర్వాత చిన్నారి అస్వస్థతకు గురికావడంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు చిన్నారికి చికిత్స అందించినా ఫలితం దక్కలేదు. దీంతో ఆ పసి ప్రాణం 11 రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. స్మోకింగ్ అలవాటును వదిలించుకోడానికి ఆమె 18 నెలల కిందట లిక్విడ్ నికోటిన్‌ను అమెరికా నుంచి తెప్పించుకుంది. దాన్ని ఇ-సిగరెట్‌లో పొగకోసం వేసుకునే వేప్‌జ్యూస్‌లో కలుపుకుని స్మోక్ చేయడం అలవాటు చేసుకుంది. అయితే, ఆమె నిర్లక్ష్యం వల్ల భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది.