తెరాసకు ఇబ్బంది కలిగించే అంశాలను ప్రస్తావిస్తాం

SMTV Desk 2019-07-05 11:49:08  bandi sanjay,

ఇంటర్ ఫలితాల వెల్లడి, విద్యార్దుల ఆత్మహత్యల విషయంలో తెరాస సర్కార్ నిర్లక్ష్య ధోరణి గురించి లోక్‌సభలో ప్రస్తావిస్తే తెరాస ఎంపీలు ఎందుకు ఉలికి పడుతున్నారని బిజెపి ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. గురువారం లోక్‌సభ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, “రాష్ట్రంలో 27మంది ఇంటర్ విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకుంటే సిఎం కేసీఆర్‌ కనీసం స్పందించలేదు. ఇంటర్ ఫలితాలలో అవకతవకలకు, విద్యార్దుల మరణాలకు బాధ్యులైనవారిపై ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. రాష్ట్రంలో పరిపాలనను గాలికొదిలేసి అక్రమాలకు, అరాచకాలకు పాల్పడుతుంటే మేము చూస్తూ ఊరుకోబోము. తెరాస సర్కార్ అవినీతిని, అక్రమాలను ఎప్పటికప్పుడు పార్లమెంటులో ఎత్తిచూపుతూ కేంద్రప్రభుత్వం దృష్టికి తీసుకువెళుతుంటాము,” అని బండి సంజయ్ అన్నారు.

నిజామాబాద్‌ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ, “రాష్ట్రంలో 27 మంది ఇంటర్మీడియట్‌ విద్యార్దులు ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారని మేము లోక్‌సభలో చెపితే ఆ విషయాన్ని రికార్డులలో నుంచి తొలగించాలని తెరాస ఎంపీలు స్పీకరును కోరడం సిగ్గుచేటు. తెలంగాణ ఉద్యమాలలో ఏనాడూ పాల్గొనని వ్యక్తి (నామా నాగేశ్వరరావు)ని తెరాస లోక్‌సభాపక్ష నేతగా నియమించుకోవడం ఇంకా సిగ్గుచేటు,” అని అన్నారు.

తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలను లేదా ఇటువంటి సమస్యలను పార్లమెంటులో ప్రస్తావిస్తే తెరాసకు ఇబ్బంది కలుగుతుందని ఆ పార్టీ ఎంపీలు స్పీకరును కలిసి విజ్ఞప్తి చేయడం ద్వారా స్పష్టం అయ్యింది. కనుక ఇక నుంచి తెలంగాణకు చెందిన ఏడుగురు కాంగ్రెస్‌, బిజెపి ఎంపీలు ప్రతీ పార్లమెంటు సమావేశాలలో తెరాసకు ఇబ్బంది కలిగించే అంశాలను ప్రస్తావిస్తూనే ఉంటారు. బిజెపి ఎంపీ బండి సంజయ్ అదే చెప్పారు. కనుక తెరాసకు వారితో తలనొప్పులు తప్పవు.