విద్యుత్ షాక్ తగిలి ఒకరు మృతి..... కాపాడబోయిన మహిళకు తీవ్రగాయాలు!!

SMTV Desk 2019-07-05 11:44:56  

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లాలో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని లింగపాలెం మండలం కలరాయనగూడెంలో ఓ మహిళ దుస్తులు ఆరేస్తుండగా విద్యుతాఘాతానికి గురైంది. సరోజిని అనే మహిళ బట్టలను ఆరేస్తుండగా, తాడులా కట్టిన ఇనుక తీగలో విద్యుత్ ప్రవహించింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ సందర్భంగా సరోజిని కేకలు విన్న పొరుగింటి మహిళ ఒకరు ఆమెను కాపాడేందుకు వచ్చారు.

సదరు మహిళ సరోజినిని కాపాడే క్రమంలో చేతితో తాకడంతో ఆమెకూ తీవ్రగాయాలు అయ్యాయి. వీరి అరుపులు విన్న స్థానికులు ఇద్దరిని రక్షించి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వీరిని పరిశీలించిన వైద్యులు సరోజిని అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. మరో మహిళకు తీవ్రగాయాలు అయ్యాయనీ, ఆమెకు ఐసీయూలో చికిత్స అందజేస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.