ఒఎన్‌జిసిని ప్రైవేటీకరించేది లేదు: ధర్మేంద్ర ప్రధాన్

SMTV Desk 2019-07-04 11:57:46  Oil and Natural Gas Corporation Ltd, petroleum minister dharmendra pradhan

ప్రభుత్వరంగ ఇంధన దిగ్గజం ఒఎన్‌జిసినిపై కేంద్ర పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజ్యసభలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఒఎన్‌జిసిని ప్రైవేటీకరించడం గానీ, పెట్టుబడులు ఉపసంహరించడం గానీ చేయడం లేదని స్పష్టం చేశారు. సహజ వనరుల విషయంలో రెండు సమస్యలు ఉన్నాయని, ఒకటి మన దగ్గర ఎంత ఉందో అంచనా వేయడం, రెండోది దీనిని డబ్బుగా మార్చుకోవడం అని అన్నారు.అయితే ఒఎన్‌జిసిలో పెట్టుబడుల ఉపసంహరణ గానీ, ప్రైవేటీకరణ గానీ జరగడం లేదని ప్రధాన్ అన్నారు. అయితే ఒఎన్‌జిసి కనుగొన్న కొన్ని చమురు క్షేత్రాలను పారదర్శక బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా డబ్బును ఆర్జించేందుకు వినియోగిస్తామని అన్నారు. ‘మేము వాటిని ద్రవ్య రూపంలోకి మార్చుతున్నాం అంతే, ఒఎన్‌జిసి కూడా తిరిగి పెట్టుబడులు పెడుతుంది. ఇతర ప్రభుత్వ సంస్థలు కూడా ఇదే చేస్తున్నాయి. అంతర్జాతీయంగా టెక్నాలజీ కంపెనీలు కూడా పెట్టుబడులు పెడుతున్నాయి’ అని ఆయన వివరించారు. అదే సమయంలో భారత్ చమురు అవసరాల కోసం 80 శాతం దిగుమతి చేసుకుంటోందని, దీని కోసం సహజ వనరులను ద్రవ్యరూపంలో మార్చాల్సిన అవసరం ఉందన్నారు.