హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల క్రమబద్దీకరణకు ఆర్‌బిఐ అధికారాలు

SMTV Desk 2019-07-04 11:56:45  housing finance company, rbi

రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణ సంస్థల (హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల) క్రమబద్దీకరణకు గాను తగిన అధికారాలు ఇవ్వనుందని సమాచారం. దీంతో ఈ సంస్థలు కఠిన ఆస్తుల నాణ్యత సమీక్షలను ఎదుర్కొనే అవకాశముందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో సహా 80 గృహ రుణ సంస్థలపై నిఘా మరింత పెరగనుంది. దీని వల్ల ఈ సంస్థలు ఏమైనా తప్పిదాలకు పాల్పడినట్లయితే జరిమానాలు, ఆంక్షలు విధించే అవకాశాలు ఉన్నాయి. 2015లో రిజర్వు బ్యాంక్ అలాగే బ్యాంకుల ఆస్తుల పరిశీలన చేపట్టింది.రుణ సంస్థలు తమ పుస్తకాల్లో మొండి బకాయిలకు సంబంధించిన వివరాలను దాచి ఉంచుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో అప్పట్లో ఆర్‌బిఐ ఆస్తుల నాణ్యతపై సమీక్ష చేపట్టింది. బ్యాంకుల ఆస్తుల నాణ్యత సమీక్షల్లో ఆర్‌బిఐ.. సంస్థలకు చెందిన మొండి బకాయిలకు సంబంధించిన పలు విషయాలను గుర్తించింది. తొలుత వాటిపై జరిమానాలు విధించింది. అలాగే ఆయా సంస్థల మొండి బకాయిలు మరింతగా పేరుకుపోతుండండంతో ఆర్‌బిఐ అలాంటి బ్యాంకు పుస్తకాలపై కఠిన నిబంధనలను విధించింది. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు కూడా ఎన్‌బిఎఫ్‌సిలో(నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు) భాగమే.. అయితే వీటి నియంత్రణ నేషనల్ హౌసింగ్ బోర్డు చేపడుతోంది. అయితే సెంట్రల్ బ్యాంక్‌కు ప్రత్యక్షంగా ఈ సంస్థలపై అథారిటీ లేదు. ఇతర ఎన్‌బిఎఫ్‌సిలపై ఆర్‌బిఐతో సహా పలు రెగ్యులేటర్లతో అంటిముట్టనట్టుగానే నియంత్రణ ఉంది.