7 లక్షల ప్రభుత్వ పోస్టులు ఖాళీ: కేంద్ర మంత్రి

SMTV Desk 2019-07-04 11:56:04  

దేశంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 7 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖమంత్రి సంతోష్ గాంగ్వార్ చెప్పారు. 2018 మార్చి వరకు ఒక్క రైల్వేలోనే 2.6 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి వెల్లడించారు. లోక్‌సభలో కాంగ్రెస్ ఎంపీ దీపక్ బైజ్, బీజేపీ ఎంపీ దర్శన్ జర్ధష్ లు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిస్తూ ఈ విషయం చెప్పారు. ప్రభుత్వం ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడం లేదని ఎంపీలు ఆరోపించగా, రిక్రూట్ మెంట్ నిరంతర ప్రక్రియ అని, ఖాళీల భర్తీకి రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాల పాలకులు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు.

దేశంలో మొత్తం 38.03 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులు మంజూరు కాగా, 31.19 లక్షల మంది ఉద్యోగులున్నారని మంత్రి పేర్కొన్నారు. ఒక్క రైల్వేశాఖలోనే మొత్తం 15.08 లక్షల ఉద్యోగాల పోస్టులుండగా, వీటిలో 2.59 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. రక్షణ మంత్రిత్వశాఖలో 1.87 లక్షల సివిల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని మంత్రి తెలిపారు. హోంశాఖ, పారామిలటరీ దళాలు, ఢిల్లీ పోలీసు శాఖల్లోనూ ఉద్యోగుల ఖాళీలున్నాయని మంత్రి వివరించారు.