మారుతీ సుజుకీ ఇండియా అరుదైన ఘనత!

SMTV Desk 2019-06-25 15:42:16  maruti suzuki india

న్యూఢిల్లీ: వాహనాల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్‌ఐ) అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. మే నెలలో దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 10 ప్యాసింజర్ వాహనాల జాబితాలో మారుతీ సుజుకీకి చెందిన ఎనిమిది మోడల్స్ ఉన్నాయి. ఈ మేరకు సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ తయారీదారులు (ఎస్‌ఐఏఎం) ఒక ప్రకటనలో వివరాలను ప్రకటించింది.ఆటోమొబైల్ రంగం అమ్మకాల్లో ఇటీవల అమ్మకాల్లో కాస్త వెనుకబడినప్పటికీ మారుతీ హవా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంది. గత ఏడాది ఇదే నెలలో 19,208 యూనిట్ల విక్రయాలతో నాలుగో స్థానంలో ఉన్న మారుతీ స్విఫ్ట్ 2019లో 17,039 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానంలో నిలిచి ఈసారి బెస్ట్ సెల్లింగ్ వాహనంగా నిలిచింది. సేల్స్ తగ్గినప్పటికీ మారుతీ మొదటి స్థానం సొంతం చేసుకుంది. మారుతీ స్విఫ్ట్ తర్వాత 16,394 యూనిట్ల విక్రయాలతో ఎంఎస్‌ఐ ఎంట్రీ లెవెల్ ఆల్టో రెండో స్థానం దక్కించుకుంది.గత ఏడాది ఇదే నెలలో మొదటి స్థానంలో నిలిచిన కంపాక్ట్ సెడాన్ డిజైర్ ఈ ఏడాది 16,196 యూనిట్ల అమ్మకాలతో మూడో స్థానానికి పడిపోయింది. ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో (15,176 యూనిట్లు), వేగనార్ (14,561 యూనిట్లు), వ్యాన్ ఎకో (11,739 యూనిట్లు), హ్యుందాయ్ మోటార్స్ ఇండియాకు చెందిన ఎస్‌యూవీ క్రెటా (9,054 యూనిట్లు), ఎలైట్ ఐ20 (8,958 యూనిట్లు), మారుతీ సుజుకీ ఎర్టిగా (8,864 యూనిట్లు) ఉన్నాయి.