వివాహిత అరుదైన పిటీషన్‌..

SMTV Desk 2019-06-24 13:32:41  baby, child

మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన ఓ వివాహిత అరుదైన పిటీషన్‌తో కోర్టును ఆశ్రయించింది. విడాకులకు దరఖాస్తు చేసుకుని, వేరుగా ఉంటున్న భర్తతో రెండో బిడ్డను కనే అవకాశం కల్పించాల్సిందిగా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఉద్యోగస్తులైన వీరిద్దరూ ఓ బిడ్డ పుట్టిన తర్వాత ఆమె తనను బాధలు పెడుతోందంటూ 2017లో అతను విడాకులకు అభ్యర్థించారు. అనంతరం తమ వైవాహిక జీవితం పునరుద్ధరణకు ఆమె నాందేడ్‌లోని ఓ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఈ పిటిషన్లు విచారణలో ఉండగా 2018లో ఆమె అతనితో మరో బిడ్డ కావాలంటూ న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. తన భర్తతో సంసార జీవనం ద్వారా లేదా ఐవీఎఫ్‌ ద్వారానైనా బిడ్డను కనేందుకు వీలు కల్పించాల్సిందిగా ఆమె ఓ ఫ్యామిలీ కోర్టులో గత ఏడాది పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు.. ఆమెకు బిడ్డను కనే హక్కు ఉన్నప్పటికీ చట్టానికి కొన్ని పరిమితులున్నట్లు పేర్కొంది. కృత్రిమ గర్భధారణ చట్టబద్ధమైన ఓ అవకాశంగా పేర్కొంటూ ఈ విధానం పాటించవచ్చని.. అయితే ఇందుకు ఆమె భర్త అనుమతి తప్పనిసరని పేర్కొంది. ఈమేరకు ఈనెల 24న భార్యాభర్తలిద్దరూ ఓ మ్యారేజి కౌన్సిలర్‌ను, అనంతరం నెల రోజుల్లో ఐవీఎఫ్‌ నిపుణులను కలవాలని సూచించింది. అయితే ఆమె పిటీషన్ చట్టవిరుద్ధమని, సామాజిక కట్టుబాట్లకు వ్యతిరేకమంటూ ఆమె భర్త దీన్ని వ్యతిరేకించారు.