తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో చేరిన కలెక్టర్ కుమార్తె

SMTV Desk 2019-06-13 16:06:20  smtv.com

గత మూడు నాలుగు దశాబ్ధాలుగా సామాన్య మద్యతరగతి ప్రజలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం మానుకొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాద్యాయులు సైతం తమ పిల్లలను కార్పొరేట్ కళాశాలలో చేర్పిస్తుండటం గమనిస్తే ప్రభుత్వ పాఠశాలల తీరు ఏవిధంగా ఉందో అర్ధమవుతుంది. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వం విద్యావ్యవస్థను గాడిన పెట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నందున గత రెండు మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలలు సైతం కార్పొరేట్ కళాశాలలతో పోటీ పడుతూ మంచి ఫలితాలను సాధిస్తున్నాయి.

ఈ మార్పును గుర్తించిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ అయేషా మస్రత్ ఖానం, కైసర్‌ అహమ్మద్‌ దంపతులు తమ పెద్ద కుమార్తె తబీస్ రానియాను జిల్లా కేంద్రంలో శివారెడ్డిపేటలో గల మైనార్టీ గురుకుల పాఠశాలలో చేర్పించారు. అంతకు ముందు ఆమె ఖమ్మంలో ఒక ప్రైవేట్ పాఠశాలలో 4వ తరగతి వరకు చదువుకొంది. కానీ దానికంటే ప్రభుత్వం ఏర్పాటు చేసిన మైనార్టీ గురుకుల పాఠశాలలోనే విద్యాప్రమాణాలు బాగున్నాయని గుర్తించిన కలెక్టర్ దంపతులు తమ కుమార్తెను స్వయంగా తీసుకువచ్చి చేర్పించారు. కలెక్టర్ తన కుమార్తెను తమ గురుకుల పాఠశాలలో చేర్పించడంతో ప్రజలకు కూడా ప్రభుత్వ పాఠశాలలపై మరింత నమ్మకం పెరుగుతుందని మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలల కార్యదర్శి షఫీయుల్లా అన్నారు.