గిఫ్ట్‌కు ఆశపడి రూ.85వేలు పోగొట్టుకున్న టాలీవుడ్ నటి

SMTV Desk 2019-06-12 18:43:37  

టెక్నాలజీ పెరిగిన తర్వాత బయట మోసాలు చేయడం ఆపేసి ఆన్‌లైన్ మోసాలు చేయడం మొదలెట్టారు మోసగాళ్ళు. ముఖ్యంగా నైజీరియన్ ముఠాలు ఏదో ఒకటి చేసి మన అజాగ్రత్తని క్యాష్ చేసుకుంటున్నాయి. ఇలాంటి మోసాలకు సామాన్యులు టెంప్ట్ అయ్యారంటే సరే వాళ్ళతో పాటు సెలబ్రెటీలు కూడా టెంప్ట్ అయి మోసపోతున్నారు. తాజాగా అలా నైజీరియన్ చేతిలో టాలీవుడ్ నటి సోనాక్షి వర్మ మోస పోయారు. సోనాక్షి ఫేస్‌బుక్ ఖాతాకు మే నెలలో మెర్రిన్ కిర్రాక్ పేరుతో ఓ రిక్వెస్ట్ రావడంతో ఆమె యాక్సెప్ట్ చేశారు. అప్పటి నుంచి వారిద్దరు ఛాటింగ్ చేసుకునేవారు. తాను లండన్‌లో ఉంటున్నానని, మీతో స్నేహం చేయాలని ఉందని చెప్పడంతో సొనాక్షి కూడా స్నేహంగా మాట్లాడడం మొదలెట్టింది. కొద్దిరోజుల తర్వాత ఓ గిఫ్ట్ పంపుతున్నానని, ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా హైదరాబాద్‌లోని ఇంటికి వస్తుందని చెప్పడంతో ఆమె సరే అనుకుంది. మే 27వ తేదీన ఢిల్లీ ఎయిర్‌పోర్టు అధికారినంటూ ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. మెర్రిన్ కిర్రాక్ పేరుతో మీకు బహుమతి వచ్చిందని, దాన్ని హైదరాబాద్ పంపాలంటే రూ.85వేలు కట్టాలని హిందీలో చెప్పడంతో అతను నిజంగానే అధికారి అనుకున్న సొనాక్షి అధికారి చెప్పిన బ్యాంక్ ఖాతాలో నగదు డిపాజిట్ చేసింది. వారం రోజులైనా బహుమతి రాకపోవడంతో ఎయిర్‌పోర్ట్ అధికారికి మళ్ళీ ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో మోసపోయానని గ్రహించిన సొనాక్షి వర్మ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలా ఆమెకి కుచ్చు టోపీ పెట్టాడు సదరు నైజీరియన్.