నాకు ఏం కాలేదు...కావాలనే టోర్నీ నుంచి తప్పించారు: మహ్మద్‌ షాజాద్‌

SMTV Desk 2019-06-11 18:07:26  Mohammad Shahzad

ఆప్ఘనిస్థాన్ స్టార్ బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్ మహ్మద్‌ షాజాద్‌ గాయం కారణంగా ప్రపంచకప్ కు దూరమైన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లతో రెండు మ్యాచ్‌లు ఆడిన తర్వాత ఫిట్‌నెస్‌ లేదంటూ షెహజాద్‌ను ఆ జట్టు యాజమాన్యం తొలగించింది. అతడి స్థానంలో యువ క్రికెటర్‌ ఇక్రమ్ అలీ ఖిల్‌ను ఆప్ఘన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. అయితే తాజాగా తాను ఈ మెగా టోర్నీలో ఆడకుండా ఆప్ఘన్ క్రికెట్‌ బోర్డు కుట్ర పన్నిందని మహ్మద్‌ షెహజాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా షెహజాద్ మాట్లాడుతూ "నన్ను ఎందుకు తొలగించారో ఇప్పటికీ నాకు అర్థం కాలేదు. నేను ఫిట్‌గా ఉన్నప్పటికీ.. ఫిట్‌నెస్‌ సాకుతో నన్ను జట్టు నుంచి తప్పించారు" అని పేర్కొన్నాడు. "బోర్డులో కొంతమంది కలిసి నాపై కుట్ర పన్నారు. నా స్థానంలో వేరొకరిని జట్టులోకి తీసుకోనున్నారంటూ జట్టు మేనేజర్‌, డాక్టర్‌, కెప్టెన్‌కు ముందుగానే తెలుసు. ఆఫ్ఘన్ జట్టు కోచ్ (ఫిల్ సిమ్మన్స్)కు సైతం మ్యాచ్ తర్వాత తెలిసింది. ఇది నన్ను తీవ్రంగా కలిచి వేసింది" అని షెహజాద్ తీవ్ర ఆవేదనకు గురయ్యాడు."మా కోచ్‌ కూడా నన్ను తప్పించిన విషయం తర్వాత కానీ తెలియలేదు. న్యూజిలాండ్‌ మ్యాచ్‌కు ముందు ట్రైనింగ్ ముగించుకుని నా ఫోన్ చెక్ చేసుకున్నా. మోకాలి గాయమంటూ చెప్పి మొత్తం టోర్నీ నుంచి తొలగించారు. టీమ్ బస్సులో ఉన్న ఆటగాళ్ల ఎవ్వరికీ కూడా నన్ను తప్పించిన విషయం తెలియదు. ఈ వార్త విని వారంతా షాక్‌ అయ్యారు" అని షెహజాద్‌ తెలిపాడు.