మాలిలో చెలరేగిన జాతి విభేదాలు!

SMTV Desk 2019-06-11 17:40:29  Fighting between Dogon hunters and Fulani herders has killed hundreds

బమాకో: పశ్చిమ ఆఫ్రికాలోని మాలి దేశంలో జాతి విభేదాలు చెలరేగాయి. డోంగో, ఫులానీ వర్గాల మధ్య వివాదాలు మిన్నంటాయి. తాజాగా సోమవారం డోంగో జాతులు ఉంటున్న గ్రామంపై సాయుధులైన ప్రత్యర్థులు దాడి విచక్షణా రహితంగా కాల్పులు జరపడం, తగులబెట్టడం లాంటి దుశ్చర్యలకు పాల్పడడంతో 95 మంది దుర్మరణం చెందారు. సోబానేకౌ గ్రామంలో ఇంతవరకు 95మంది పౌరులు దుర్మరణం చెందారు. మరణించిన వారిలో కొంతమంది పూర్తిగా కాలి బూడిదై పోగా.. మరికొంతమంది కాల్పుల్లో హతమయ్యారు.. మిగిలిన వారిని గుర్తించాల్సి ఉందని స్థానిక అధికారులు వెల్లడించారు. డోంగో, ఫులానీ వర్గాల మధ్య నెలకొన్న కక్షలు కారణంగానే ఈ సంఘటన చోటు చేసుకొంది. మత ప్రబోధకుడైన అమదౌకౌఫా నేతృత్వంలోని ఫులానీ జిహాదీ గ్రూపు ఈ విధ్వంసానికి పూనుకొన్నట్లు తెలుస్తోంది. ఈ జిహాదీ గ్రూపు డోంగో, బొంబారాలు మధ్య విభేదాలు రెచ్చగొట్టి హింసకు పాల్పడినట్లు సమాచారం. ఇరు వర్గాలు ఒకే ప్రాంతంలో నివసిస్తూ వ్యవసాయం చేసుకొంటూ జీవిస్తున్నారు. ఇరు వర్గాల మధ్య కొన్ని సంవత్సరాలుగా విభేదాలు కొనసాగుతున్నాయి. 2018 సంవత్సరం జనవరి నుంచి ఇంతవరకు 488 మంది ఫులానీలు హతమైనట్లు మాలిలోని యూఎన్ మిషన్ పేర్కొంది. ఒగస్సొగౌలో మార్చిలో జరిగిన ఊచకోతలో 160మంది ఫులానీలు హతమయ్యారు. ఈ దుశ్చర్యకు డోంగో వర్గాలే పాల్పడినట్లు సమాచారం.