నేడు మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం

SMTV Desk 2019-06-08 19:00:20  ap,

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన సందర్భంగా మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఈరోజు జరగనుంది. అందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు ఉదయం 11.49 గంటలకు మంత్రులు పదవీ స్వీకార ప్రమాణం చేయనున్నారు. వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం వెలుపల మంత్రి వర్గం ప్రమాణస్వీకారం నిర్వహించనున్నారు.

అదేవిధంగా సభా వేదిక, గ్యాలరీలు, బారికేడ్లు, పార్కింగ్‌ వంటి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజా ప్రతినిధులు, అతిథులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమానికి 5వేల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. రెండు మార్గాల్లో వేదిక వద్దకు ఆహ్వానితులను అనుమతిస్తారు. పాస్‌లు ఉన్నవారు వారికి కేటాయించిన గ్యాలరీల్లో కూర్చోవాలని సూచించారు. పాస్ లేకుండా సామాన్యులు ప్రమాణస్వీకారానికి హాజరు కావచ్చని కూడా సూచించారు. అతిథులందరికి అల్పాహారం, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా 1500 మందితో భద్రత ఏర్పాటు చేశామని అధికారులు స్పష్టం చేశారు.