ఫ్రాన్స్ లో స్మార్ట్ ఫోన్లపై నిషేధం

SMTV Desk 2019-06-08 16:41:18  france, smart phones,

స్మార్ట్ ఫోన్లు రాజ్యం ఏలుతున్నాయి. ఎక్కడ చూసినా స్మార్ట్ ఫోన్లే. అడుగుకో మొబైల్ షాప్ కనిపిస్తోంది. చిన్నపిల్లలు కూడా మొబైల్ ఫోన్లకు బానిసలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది.

ఫ్రాన్స్ లో స్మార్ట్ ఫోన్లపై నిషేధం విధించింది. పాఠశాలలకు వెళ్ళే విద్యార్ధినీ, విద్యార్ధులు తమతో క్లాస్ రూంలలోకి, కాలేజ్ క్యాంపస్ లలోకి స్మార్ట్ ఫోన్లు తీసుకెళ్ళడాన్ని నిషేధించింది. 15 సంవత్సరాల లోపు స్టూడెంట్స్ స్కూలు టైంలో తమతో స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ బ్యాండ్లు వంటివి తీసుకెళ్ళకూడదని ఆదేశాలు జారీచేసింది.

పిల్లల మానసిక స్థితి, కరిక్యులంపై స్మార్ట్ ఫోన్ల వినియోగం తీవ్ర ప్రభావం చూపుతోందని పరిశోధన చెబుతోంది. చిన్నారులు క్లాస్ రూంలలో స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారని, ఎడ్యుకేషన్ యాప్స్ వాడితే ఫర్వాలేదు కానీ, గేమ్స్ వంటివి ఆడుతున్నారని తేలింది. ఈ పరిణామాలపై తల్లిదండ్రులు, టీచర్లు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

చిన్నారులు కంప్యూటర్, స్మార్ట్ ఫోన్ల తెరలను వినియోగించే సమయాన్ని తగ్గిస్తేనే వారిలో తెలివితేటలు పెరుగుతాయని ఒక అధ్యయనంలో వెల్లడైంది.2018లో 9వ తరగతి వరకూ స్మార్ట్ ఫోన్లపై ఫ్రాన్స్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన లభిస్తోంది. పలువురు విద్యావేత్తలు ఈ ఆదేశాలపై సానుకూలంగా స్పందించారు. మరికొందరయితే స్మార్ట్ ఫోన్లపై అజమాయిషీ చేస్తే విద్యార్ధులకు మంచి ఫలితాలు వస్తాయంటున్నారు. పర్యవేక్షణ చేయడం ద్వారా దురుపయోగం అరికట్టవచ్చని, అంతేగానీ విద్యార్ధులు పాఠశాలలకు వెళ్ళిన తర్వాత తిరిగి వచ్చేవరకూ స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండాలని సరికాదంటున్నారు. అయితే దివ్యాంగులకు ఈ విషయంలో మినహాయింపు ఇచ్చింది ప్రభుత్వం.