జగన్ లో ఎంత మార్పువచ్చిందంటే .. జేడీ సంచలన వ్యాఖ్యలు

SMTV Desk 2019-06-08 16:07:51  JD Chakravarthi, jagan,

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటుడు జేడీ చక్రవర్తి. గతంతో పోలిస్తే జగన్ వ్యవహార శైలిలో ఎంతో మార్పు వచ్చిందని మెచ్చుకున్నారు. జేడీ నటించిన ‘హిప్పీ’ చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఆ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇటీవల ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జగన్‌పై మీ అభిప్రాయం ఏంటి? అని విలేకరి అడిగిన ప్రశ్నకు జేడీ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

జగన్ గురించి జేడీ ప్రస్తావిస్తూ…‘2008లో జోష్ సినిమా చిత్రీకరణలో భాగంగా విమానంలో వెళ్తున్నా. అప్పటికే నాకు రోడ్డు ప్రమాదం అయి బాధపడుతున్నా. సీట్లో కూర్చోలేక వీల్ చైర్‌ కోసం అడిగా. ఆ సమయంలో జగన్ నా పక్కనే ఉన్నారు. కనీసం ఆయన నన్ను చూసి కూడా పలకరించలేదు. ఆయన ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయా. అదే 2018లో మరోసారి విమానంలో వెళ్తుండగా అప్పుడు కూడా జగన్ అదే విమానంలో ప్రయాణించారు. విమానం దిగి వెళ్తుండగా జగన్ దంపతులు నా దగ్గరకు వచ్చి హలో చెప్పి బాగున్నారా అండీ! అని పలకరించారు.’ అని తెలిపారు. జగన్‌లో మార్పు ఎంత వచ్చిందో చెప్పడానికి ఇదో ఉదాహారణ అని జేడీ చక్రవర్తి అన్నారు.