ప్రత్యేక హోదా పై కీలక వ్యాఖ్యలు చేసిన కన్నా

SMTV Desk 2019-06-08 15:57:07  Special Status, Andhra Pradesh,

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అనే వాదన ముగిసిన అధ్యాయమని అన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ఈ నెల 9వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ తిరుమల పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు తిరుపతి వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో ఐదేళ్లలో జరిగిన అభివృద్ధికి నిదర్శనం బీజేపీ అఖండ విజయానికి కారణమని తెలిపారు. అలాగే రాష్ట్రంలో మాపై విషప్రచారం చేశారని మండిపడ్డ కన్నా.. వైఎస్ జగన్ ట్రాప్ లో పడుతున్నావని ఆనాడే చంద్రబాబును మోడీ హెచ్చరించారని.. అయినా ఆయన పట్టించుకోలేదని కన్నా గుర్తుచేశారు.
అదేవిధంగా ఏపీకి అన్నీ ఇచ్చామని చెప్పినా... మా మాట పట్టించుకోకుండా మాపై నిందలు మోపారని విమర్శించారు కన్నా లక్ష్మీనారాయణ. ఇంకా ఏపీ అభివృద్ధి దేశ అభివృద్ధి అనే నినాదానికి ప్రధాని మోడీ కట్టుబడి ఉన్నారని స్పష్టం చేశారు. మేం చేసిన అభివృద్ధికి తగిన ప్రచారం లభించకపోవడం వల్లే ఏపీలో వెనుకబడ్డామని తెలిపారు. ఇక ప్రత్యేక హోదా అనే అంశంగా ముగిసిపోయిందని.. హోదాపై ఇక ఎవరు మాట్లాడినా ప్రజలను మళ్లీ మభ్యపెట్టడమే అవుతుందని కన్నా లక్ష్మీనారాయణ వివరించారు.