వయాగ్రా సేకరణ కోసం వెళ్లి ఎనమిది మంది మృతి

SMTV Desk 2019-06-07 17:12:22  yarsa gumba, vayagra,

హిమాలయాల్లో గురువారం సాయంత్రం ఘోరం జరిగింది. హిమాలయ వయాగ్రా పిలువబడే ‘యార్సాగుంబా’ వనమూలికల సేకరణ కోసం వెళ్లి ఎనమిది మంది నేపాలీలు అక్కడ జరిగిన ప్రమాదంలో మృతిచెందారు. ఈ ప్రమాదంలో తల్లితో వెళ్లిన ఓ చిన్నారి కూడా ప్రాణం కోల్పోయిందని అక్కడి పోలీసులు తెలిపారు. నేపాల్‌లోని డోప్లా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. లైంగిక సామర్థ్యాన్ని పెంచడంలో యార్సాగుంబా చురుగ్గా పనిచేస్తుందని ఓ అభిప్రాయం. కేవలం వేసవిలోనే లభించే దీని ఖరీదు కేజీ 60 లక్షలు పలుకుతుంది.

దీంతో గ్రామీణ నేపాలీలు వేసవి ప్రారంభంకాగానే హిమాలయాలకు వీటి సేకరణ కోసం వెళుతారు. గొంగళి పురుగు ఆకారంలో ఓ పురుగు లార్వా తలపై పుట్టగొడుగు మాదిరిగా పెరిగే ఫంగస్‌ ‘యార్సాగుంబా’. పూర్తిగా రూపొందిన యార్సాగుంబా రెండు నుంచి మూడు సెంటిమీటర్ల పొడవు ఉంటుంది. యార్సాగుంబా సేకరణ నేపాల్‌లో చాలామందికి ఉపాధి మార్గం కావడంతో అక్కడి ప్రభుత్వం వీరి కోసం వైద్య శిబిరాలు కూడా నిర్వహిస్తుంది. వీటి సేకరణలో అనేక ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి.