నా మనసుకు బాగా కనెక్ట్ అయిన సినిమా

SMTV Desk 2019-06-07 17:10:28  samantha,

సమంత అక్కినేని, రావు రమేష్, నాగ శౌర్య, రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రల్లో నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఓ బేబీ’. జులై 5న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ చిత్రం. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటైన పాత్రికేయుల సమావేశంలో డి.సురేష్ బాబు, సమంత, నందినీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో డి.సురేష్ బాబు మాట్లాడుతూ “సురేష్ ప్రొడక్షన్స్ స్థాపించి 55 ఏళ్ళు అయింది. మొదటిసారి మా సంస్థలో లేడి ఓరియంటెడ్ సినిమా చేశాం. ‘ఓ బేబీ’ సినిమాను ఇప్పటికే ఏడు భాషల్లో రీమేక్ చేశాం. సమంత, జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌తో పాటు ఇతర నటీనటులందరు బాగా చేశారు. జులై 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది”అని అన్నారు. నందినీ రెడ్డి మాట్లాడుతూ “నా నాలుగవ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్‌లో చేస్తునందుకు ఆనందంగా ఉంది. ఒకరోజు సమంత ఫోన్ చేసి ‘ఓ బేబీ’ ఒరిజినల్ వర్షన్ చూడమని చెప్పడం జరిగింది. సినిమా చూశాక రచయిత లక్ష్మి భూపాల్ కు ఈ విషయం చెప్పాను. ఇద్దరం ఈ సినిమా మీద నమ్మకంతో ముందుకు వెళ్లాం. ఇక ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పనిచేశారు. సమంత ఈ సినిమాలో కనిపించినన్ని వేరియేషన్స్‌లో ఏ చిత్రంలో కనిపించలేదు”అని తెలిపారు. సమంత మాట్లాడుతూ “ఈ ఏడాది తమిళ్‌లో ‘సూపర్ డీలక్స్’, తెలుగులో ‘మజిలీ’ సినిమాలతో హిట్స్‌ను అందుకున్నాను. ఇప్పుడు ‘ఓ బేబి’ సినిమా రాబోతోంది. వరుస సక్సెస్ సినిమాల్లో నటిస్తున్నందుకు ఆనందంగా ఉంది. నా మనసుకు బాగా కనెక్ట్ అయిన సినిమా ఇది. సినిమాలోని నా పాత్ర ఛాలెంజింగ్‌గా అనిపించింది . గోదావరి యాసలో ప్రేక్షకులను మెప్పించబోతున్నాను”అని చెప్పారు. ఈ సమావేశంలో నటుడు తేజ, రచయిత లక్ష్మి భూపాల పాల్గొన్నారు.