జిన్‌పింగ్‌, పుతిన్‌తో ముఖాముఖి

SMTV Desk 2019-06-06 15:41:09  russia, china

బీజింగ్‌: చైనా అధ్యక్షడు సీజిన్‌పింగ్ మూడు రోజుల పర్యటన కోసం బుధవారం రష్యా చేరుకున్నారు. అనంతరం రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్‌ పుతిన్‌ మధ్య జరిగిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం, సహకార సంబంధాలను మరింత పెంపొందించుకోవడం ద్వారా నూతన శకాన్ని నెలకొల్పాలని నిర్ణయించారు. విమానాశ్రయం నుండి అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌కు తరలి వెళ్లిన సీ జిన్‌పింగ్‌, పుతిన్‌తో ముఖాముఖి చర్చలు జరిపారు. జిన్‌పింగ్‌ గౌరవార్థర రష్యా అధ్యక్షుడు విందు ఇచ్చారు. ఇరాన్‌పై యుద్ధానికి ట్రంప్‌ రంకెలు వేస్తుండడం, చైనాపై ఏకపక్షంగా వాణిజ్యయుద్ధాన్ని ప్రకటించడం వంటి పరిణామాల నేపథ్యంలో జిన్‌పింగ రష్యా పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గురువారం నాడు మాస్కో నుండి రష్యాలోని పాత రాజధాని నగరం సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌కు వెళ్లి అక్కడ పుతిన్‌ ఆధ్వర్యంలో గురు-శుక్రవారాల్లో జరిగే ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటారు. రష్యా పర్యటనకు బయల్దేరే ముందు జిన్‌పింగ్‌ తనను కలిసిన రష్యన్‌ మీడియా ప్రతినిధు లతో మాట్లాడుతూ చైనా-రష్యా మధ్య రాజకీయ సంబంధాలను మరింత బలోపేతం గావించడంతోపాటు పరస్పర విశ్వాసం, ఎదుటి వారికి మద్దతు కొనసాగించటం వంటి అంశాలకు ఇరు దేశాలు నిబద్ధతతో కృషి చేస్తాయని చెప్పారు. చైనా అధ్యక్షుడి పర్యటన ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలలో ఒక కీలకమైన ఘట్టమని పుతిన్‌ విదేశాంగ విధాన సలహాదారు యూరి యుషకోవ్‌ వ్యాఖ్యానించారు. 1949లో కమ్యూనిస్టు చైనాను అధికారికంగా గుర్తించిన తొలి దేశం నాటి సోవియట్‌ రష్యానేనని ఆయన గుర్తు చేశారు. ప్రపంచ భాగస్వామ్యం, వ్యూహాత్మక సహకారంతో కొత్త శకంలో ప్రవేశించే విషయమై సీ జిన్‌పింగ్‌ పుతిన్‌ ఒక ఉమ్మడి ప్రకటనపై సంతకాలు చేస్తారని ఆయన వివరించారు. చైనా బృందం రెండు పాండాలను మాస్కో జూకు కానుకగా బహూకరించింది. ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధిలో సీ పర్యటన ఒక మైలురాయిగా నిలిచిపోతుందని చైనా ఉప విదేశాంగ మంత్రి ఝాంగ్‌ హానురు చెప్పారు.