చైనా పెట్టుబడులు అమెరికాకు అవసరం!

SMTV Desk 2019-06-06 15:40:33  stephen roach

న్యూయార్క్‌: అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక వేత్త స్టీఫెన్‌రోచ్‌ అక్కడి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఎదుర్కొంటున్న ప్రతీ సమస్యకూ చైనాను నిందించటం అమెరికన్‌ రాజకీయ వేత్తలకు ఒక రివాజుగా మారిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నగదు నిల్వలు లేని తమ దేశ ఆర్థిక వ్యవస్థలోకి చైనా వంటి ఇతర ప్రధాన దేశాల నుండి పెట్టుబడులను దిగుమతి చేసుకోవాల్సిన అవసరం వుందని ఆయన అభిప్రాయపడ్డారు. దేశీయంగా వేళ్లూనుకున్న సమస్యలకు బాధ్యత వహించకుండా ఎదుటివారిని నిందించటానికి మాత్రమే ఈ ఆరోపణల పర్వం పనికొస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సర తొలి త్రైమాసికంలో అమెరికా నికర పొదుపు రేటు 2.4 శాతం వద్ద నిలిచిపోయిందని ఆయన వివరించారు. 20వ శతాబ్దపు చివరి మూడు దశాబ్దాలలో 6.3 శాతం మేర కొనసాగిన అమెరికా పొదుపు రేటు 2019లో సగానికన్నా తక్కువ పడిపోయిందన్నారు. వాణిజ్య లోటును భర్తీ చేసుకునేందుకు దిగుమతులపై టారిఫ్‌లు పెంచే వ్యూహం అత్యంత ఘోరమైన తప్పిదమని, ఈ చర్యలు వాణిజ్య లోటును ఏ మాత్రం తగ్గించలేవని ఆయన అన్నారు. వాణిజ్యలోటును భర్తీ చేసుకోవాలనుకుంటే ముందుగా దేశీయ పొదుపును ప్రోత్సహించాల్సిన అవసరం వుందని ఆయన అన్నారు.