ఇరాన్‌తో యుద్ధాన్ని కోరుకోవడం లేదు: ట్రంప్

SMTV Desk 2019-06-06 12:49:09  donlad trump sensational comments on Iran war

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ మీడియాతో సమావేశమయ్యారు. అయితే ఈ సమావేశంలో ఇరాన్‌తో యుద్ద వాతావరణంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధానికి అవకాశం లేకపోలేదని స్పష్టం చేశారు. ఇరాన్‌తో యుద్ధాన్ని నేను కోరుకోవడం లేదు. కానీ, యుద్ధానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది అని వ్యాఖ్యానించారు. ఇరాన్‌తో చర్చించేందుకు తాను సిద్ధంగానే వున్నా నని, అయితే దానికి ముందు ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని నిలిపివేయాలని ఆయన షరతు విధించారు. తనపై ఆంక్షలను ఎత్తివేస్తే, అణు కార్యక్రమం నిలిపేస్తామని ఇరాన్‌ డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. అమెరికా అణ్వాయుధ సంపత్తికి బాధ్యత వహిస్తున్న వ్యక్తిగా తను పూర్తి బాధ్యతతో మాట్లాడుతున్నానని, అణ్వాయుధ వినియోగం ఒక బాధ్యత అని, దానిని నిర్వహించేందుకు తాను సిద్ధమని చెప్పారు. ఇరాన్‌ అణు కార్యక్రమం గురించి నానా యాగీ చేస్తున్న ట్రంప్‌ ఇజ్రాయిల్‌ అణ్వాయుధాలను సమకూర్చుకొంటున్నా దాని ఊసే ఎత్తకపోవడం గమనార్హం. ప్రస్తుతం బ్రిటన్‌ పర్యటనలో వున్న ట్రంప్‌ పర్యటనకు బయల్దేరే ముందు ఇచ్చిన ఈ ఇంటర్వ్యూ మీడియాలో ఆయన పర్యటన చివరి రోజు ప్రసారమవుతుండటం విశేషం. 2015లో ఇరాన్‌తో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుండి గత ఏడాది వైదొలగిన అమెరికా ఇరాన్‌పై విధించిన ఆంక్షలకు బ్రిటన్‌, ఇతర ఐరోపా దేశాల మద్దతును ట్రంప్‌ కోరుతున్నారు. గల్ఫ్‌ దేశాలలో వున్న తమ దేశీయులపై దాడులకు ఇరాన్‌ ప్రయత్నిస్తోందని, సౌదీ తీరంలో నిలిచి వున్న ఎమిరేట్స్‌ చమురు టాంకర్లపై జరిగిన దాడి ఇందులో భాగమేనని ఆరోపిస్తున్న అమెరికా అందుకు తగిన ఆధారాలను చూపటంలో విఫలమైంది. అమెరికా ఆరోపణలను ఇరాన్‌ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. తాము చర్చలకు సిద్ధంగా వున్నామంటున్న ఇరాన్‌ దెయ్యాలతో జరిపే చర్చలె పుడూ సత్ఫలితాలనివ్వబోవని వ్యాఖ్యానించింది.