రవాణా నౌక ప్రమాదం....17 మంది గల్లంతు

SMTV Desk 2019-06-06 12:48:30  Indonesia transport boat accident in 17 people missing

జకార్తా: తూర్పు ఇండోనేసియాలో మరో నౌక ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటన చాల ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం మధ్యాహ్నం 18 మందితో ఉన్న ఒక రవాణా నౌక మునిగిపోయి 17 మంది గల్లంతయ్యారని అధికారులు బుధవారం తెలిపారు. సులవేసి ద్వీపకల్పంలోని బిటుంగ్ నుంచి బయల్దేరిన ఈ రవాణా నౌక దక్షిణాన ఉన్న మొరొవాలికి వెళ్తూ ప్రమాదానికి గురయిందని సహాయక చర్యలు చేపడుతున్న అధికారులు తెలిపారు. బోల్తాపడిన నౌకలోని లైఫ్ జాకెట్ ధరించిన 35 ఏళ్ల ఒక వ్యక్తి మాత్రం నీటిపై తేలియాడుతూ మంగళవారం అటుగా వెళ్తున్న మరో నౌకలోని వ్యక్తులకు కనిపించాడు. ప్రస్తుతం అతనికి వైద్య చికిత్సలు అందిస్తున్నట్టు అధికారులు తెలిపారు. నౌకలోని మిగతా 17 మంది సిబ్బంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదని వారు వివరించారు.