నేడు మరో ఆసక్తికరమైన పోరు....ఆసిస్ VS విండీస్

SMTV Desk 2019-06-06 12:47:22  Australia vs west indies

నాటింగ్‌హామ్: వరల్డ్ కప్ లో భాగంగా నేడు నాటింగ్ హామ్‌లోని ట్రెంట్ బ్రిడ్జ్ మైదానం వేదికగా ఆస్ట్రేలియా- వెస్టిండీస్‌తో తలపడనుంది. ఇప్పటివరకు చెరో మ్యాచ్ ఆడిన ఇరు జట్లు ప్రత్యర్థులపై సునాయాస విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. రన్‌రేట్ ఆధారంగా వెస్‌ట ఇండీస్ అగ్రస్థానంలో ఉన్నప్పటికీ రెండు జట్ల విజయాలలో పెద్ద తేడా లేదు. గత చరిత్ర విషయానికి వస్తూ ఇప్పటివరకు 11 ప్రపంచకప్‌లు జరిగితే ఏడు సార్లు ఈ రెండు జట్లే విశ్వ విజేతలుగా నిలిచాయి. అయితే అప్పటికీ, ఇప్పటికీ రెండు జట్ల బలాబలాల్లో చాలా మార్పులే వచ్చాయి. ప్రస్తుత టోర్నమెంట్‌లో ఈ రెండు జట్ల విజయాలను పరిశీలిస్తే ఒక్క తేడా స్పష్టంగా కనిపిస్తుంది.పాకిస్తాన్‌పై వెస్టిండీస్ పూర్తిగా బౌలర్ల ఆధిపత్యం కారణంగా విజయం సాధిస్తే, అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఆధిక్యం కనిపించింది. వార్నర్, ఫించ్, సిత్, ఖావాజా, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, కారీ లాంటి బ్యాట్స్‌మెన్‌తో ఆస్ట్రేలియా లైనప్ ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. అయితే పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను గడగడలాడించిన ఆండ్రీ రస్సెల్, ఒషానే థామస్‌ల ముందు వారు ఏ మేరకు రాణిస్తారనేదే ముఖ్యం. ఇక బ్యాటింగ్ విషయానికి వస్తే క్రిస్ గేల్, రస్సెల్‌లపైనే వెస్టిండీస్ ఎక్కువగా ఆధారపడుతున్నప్పటికీ నికొలస్ పూరన్, హోల్డర్, బ్రావో, బ్రాత్‌వైట్‌లాంటి ఆల్‌రౌండర్లు కూడా మ్యాచ్‌ని గెలిపించగల సమర్థులే. అయితే బౌలింగ్ విషయంలో ఆస్ట్రేలియా కూడా తక్కువేమీ కాదు. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ కోల్టర్ నైల్‌లాంటి ఫాస్ట్ బౌలర్లకు తోడు నాథన్ లియాన్, ఆదమ్ జంపాలాంటి మేటి స్పిన్నర్లు కూడా జట్టులో ఉన్నారు. ఇక ట్రెంట్ బ్రిడ్జ్ పిచ్ భారీ స్కోర్లకు పెట్టింది పేరు. ఈ నేపథ్యంలో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి.