జోమాటో ఉద్యోగులకు శుభవార్త

SMTV Desk 2019-06-06 12:28:45  zomato, zomato workers have 26 weeks holidays

ముంభై: ఫుడ్ డెలివరీ సంస్థ జోమాటో తమ ఉద్యోగులకు ఓ శుభవార్త చెప్పింది. తాజాగా తమ ఉద్యోగులకు 26 వారాల ప్రసూతి సెలవుల్ని ప్రకటించింది. సాధారణంగా మాతృత్వ సెలవులు, పితృత్వ సెలవులు వేర్వురుగా ఉంటాయి. అందులో భాగంగా మహిళలకు ఎక్కువ రోజులు, పురుషులకు కొంత తక్కువ సెలవులు ఇస్తారు. కానీ జొమోటో మాత్రం స్త్రీ, పురుషులకు సమానంగా 26 వారాల సెలవులను ప్రకటించింది. కుటుంబంతో గడిపేందుకు సమయాన్ని కేటాయించడం చాలా ముఖ్యం అన్న విషయాన్ని గుర్తించి ఈ కొత్త సెలవుల విధానాన్ని అమలుచేస్తోంది జొమోటో. అంతేకాకుండా వెయ్యి డాలర్లు కూడా ఇవ్వనుంది సంస్థ. పిల్లల్ని కనే తల్లిదండ్రులకు 26 వారాల సెలవుల్ని ప్రకటించిన కంపెనీ జొమోటో మాత్రమే కాదు, గత ఏడాది ఫర్నీచర్‌ కంపెనీ ఐకియా కూడా ఇలాంటి విధానాన్ని అమలు చేసింది. మహిళలకు 26 వారాల ప్రసూతి సెలవులు, మరో 16 వారాలు డ్యూటీ టైమింగ్స్‌లో 50 శాతం వెసులుబాటు కల్పించింది. పురుషులకు 26 వారాల సెలవు కూడా అమలు చేసింది. భారతదేశంలో మెటర్నీటీ బెనిఫిట్స్‌ యాక్ట్‌, 1961ప్రకారం సంస్థలన్నీ 26 వారాల మాతృత్వ సెలవులు తప్పనిసరి. కానీ పితృత్వ సెలవులపై కఠినమైన నిబంధనలేవీ లేవు. అయితే పిల్లల్ని కనడం, వారి బాగోగులు చూసుకోవడంలో తల్లితో పాటు తండ్రి పాత్ర కూడా ఉంటుంది. డెలివరీ సమయంలో, ఆ తర్వాత తల్లితోపాటు తండ్రి కూడా పిల్లల దగ్గర సమయం గడపాల్సి ఉంటుంది. అందుకే మహారాష్ట్రకు చెందిన ఎంపి రాజీవ్‌ సతవ్‌ గతంలో పార్లమెంట్‌లో పెటర్నిటీ బెనిఫిట్‌ బిల్‌ ప్రతిపాదించారు. తల్లితోపాటు తండ్రికి కూడా సమానమైన బెనిఫిట్స్‌ రావాలని కోరారు.