ఉత్తమ్ రాజీనామాపై కాంగ్రెస్ లో గుసగుసలు

SMTV Desk 2019-06-05 16:20:54  Utham Kumar,

టిపిసిసి అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి ఉత్తమ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారని వార్తలు వస్తున్నాయి. తాను రాజీనామా విషయాన్ని జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి తెలియజేసినట్టు కాంగ్రెస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. కొత్త టిపిసిసి చీఫ్ గా వేరొకరిని నియమించాలని ఆయన రాహుల్ ను కోరినట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాజయం పాలైంది. అయితే లోక్ సభ ఎన్నికల్లో మాత్రం నల్లగొండ, భువనగిరి, మల్కాజ్ గిరి స్థానాల్లో ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డిలు ఎంపిలుగా విజయం సాధించారు. కానీ పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా అపజయం మూటగట్టుకుంది. దీంతో కలత చెందిన ఉత్తమ్ టిపిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత నాలుగేళ్లుగా ఉత్తమ్ పిసిసి చీఫ్ గా కొనసాగుతున్నారు. 2018 తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో ఉత్తమ్ సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నుంచి ఎంఎల్ఎగా విజయం సాధించారు. నల్లగొండ నుంచి ఆయన లోక్ సభకు ఎన్నికకావడంతో ఎంఎల్ఎ పదవికి రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. హుజుర్ నగర్ ఉప ఎన్నికల్లో ఉత్తమ్ తన భార్య పద్మను బరిలోకి దించనున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా ఉత్తమ్ టిపిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తే, ఆ పదవిలో మంథని ఎంఎల్ఎ, మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తమ్ రాజీనామాపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.