ఈ నెల 12 నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు

SMTV Desk 2019-06-05 15:52:33  jagan,

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. నూతన శాసనసభ తొలి సమావేశాలు ఈనెల 12 నుండి ప్రారంభం కానున్నాయి. ఐదు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో నూతనంగా ఎన్నికైన 175 మంది, అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు పదవీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. స్పీకర్‌ ఎన్నిక కూడా జరగనుంది. కాగా, సమావేశాలు ప్రారంభానికి ముందే ప్రొటెం స్పీకర్ గా బొబ్బిలి వైసీపీ ఎమ్మెల్యే సంబంగి వెంకట చిన అప్పలనాయుడిని నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 12న అసెంబ్లీ ప్రారంభమైన తరువాత, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తరువాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.

ఇక అంతకుముందే మంత్రివర్గం కూడా ఏర్పాటు కానుందని పార్టీ నేతలు అంటున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తన మంత్రివర్గాన్ని రెడీ చేసుకుంటున్నారు. ఈనెల 8న తొలిసారిగా సచివాలయంలోకి వెళ్లాలని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఇక అదే రోజున మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నట్లు కూడా విశ్వసనీయ వర్గాల సమాచారం. మంత్రివర్గ విస్తరణకు ఒక రోజు ముందుగా అంటే 7వ తేదీన వైయస్సార్‌ ఎల్పీ సమావేశం ఏర్పాటుచేసి తాను మంత్రులుగా ఎవరెవరిని తీసుకోబోతున్నది ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలతో చర్చించి వారి అభిప్రాయాలను తీసుకోనున్నారు. వారికి ముందుగానే చెప్పడం ద్వారా పదవులు దక్కని వారిని మానసికంగా సిద్ధం చేసినట్లవుతుందని జగన్‌ యోచిస్తున్నారని సమాచారం. ఇక వైయస్‌ జగన్‌ కొత్త తరహా విధానాలను అవలంభిస్తున్నారని భోగట్టా. ఎవరెవరికైతే మంత్రి పదవులు ఇవ్వాలనుకుంటున్నారో వారిపై ఉన్న ప్లస్‌, మైనస్‌లను తెలుసుకునేందుకు స్పెషల్ టీంని ఏర్పాటు చేశారట. దీంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది.