బాబు కి షాక్ ఇచ్చిన కేశినేని

SMTV Desk 2019-06-05 15:11:58  Chandraababu, Keshineni

తెలుగుదేశం పార్టీ అధినేతకి విజయవాడ ఎంపీ కేశినేని నాని షాక్‌ ఇచ్చారు. పార్లమెంటరీ విప్‌ పదవిని ఆయన తిరస్కరిస్తూ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో ఆయన చేసిన పోస్ట్‌ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. లోక్‌సభలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా గల్లా జయ్‌దేవ్‌ను , అలాగే లోక్‌సభ ఫ్లోర్ లీడర్‌గా రామ్మోహన్‌నాయుడిని, పార్టీ విప్‌గా కేశినేని నానిని నియమించారు చంద్రబాబు. అయితే పార్టీ కోసం వ్యాపారాలనే వదిలేసిన తనకు తక్కువ పదవి కట్టపెట్టడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కేశినేని సోషల్ మీడియా ద్వారా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పెద్ద పదవి ఇచ్చినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలంటూ దెప్పి పొడిచారు. తాను ఈ పదవి స్వీకరించలేనని, తాను అంత సమర్ధుడిని కాదని పార్టీలో సమర్ధవంతమైన నేతలకు పదవులు ఇవ్వాలంటూ సూచించారు. పార్టీ ఇచ్చే విప్‌ పదవి కంటే ప్రజలకు సేవ చేయడమే సంతృప్తి ఇస్తుందన్న కేశినేని పదవి తిరస్కరిస్తున్నందుకు క్షమాపణలు చెబుతూ ఫేస్‌బుక్‌ పోస్ట్‌లో పేర్కొన్నారు.

ఇక సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కేవలం మూడు ఎంపీ సీట్లతో సరిపెట్టుకుంది. అందుకే ముగ్గురికి మూడు పదవులు ఇచ్చి సరిపెట్టారు చంద్రబాబు. అయినా విప్ పదవి తీసుకోవడానికి కేశినేని నాని మినహా లోక్ సభలో టీడీపీకి మరో నాయకుడు లేడు. ఇలాంటి సమయంలో మరో నేతకు విప్ పదవి ఇవ్వాలని కేశినేని నాని వ్యాఖ్యానించడం పార్టీపై అసంతృప్తికి అద్దంపడుతోంది. కొద్దిరోజుల క్రితం బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కేశినేని నాని కలవడంతో... ఆయన బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు వచ్చాయి. దీంతో ఆయన టీడీపీని వీడేందుకే ఈ రకమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. చూడాలి మరి ఏమవుతుందో ?