తెరపైకి ట్రిపుల్ తలాక్ బిల్

SMTV Desk 2019-06-05 14:35:09  triple talak bill,

ముమ్మారు తలాక్ చెప్పడం ద్వారా విడాకులు తీసుకునే ముస్లింలలో ఉన్న సంప్రదాయాన్ని నిషేధించే బిల్లును మరోసారి పార్లమెంటులో ప్రవేశపెడతామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం చెప్పారు. ప్రస్తుతం ఈ బిల్లు రాజ్యసభలో పెండింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. గత నెల 16వ లోక్‌సభ రద్దు కావడంతో పార్లమెంటులో ఈ బిల్లుకు ఆమోదం లభించలేదు. రాజ్యసభలో ప్రవేశపెట్టి అక్కడ పెండింగ్‌లో ఉండే బిల్లులు లోక్‌సభ రద్దుతో కాలం చెల్లిపోవు కానీ లోక్‌సభలో ఆమోదం పొంది రాజ్యసభలో పెండింగ్‌లో ఉండే బిల్లులు మాత్రం కాలం చెల్లిపోతాయి.

ట్రిపుల్ తలాక్ అంశం బిజెపి ఎన్నికల ప్రణాళికలో ఉందని, తక్షణ ట్రిపుల్ తలాక్‌ను నిషేధించే ముస్లిం మహిళల వివాహ హక్కుల పరిరక్షణ బిల్లును మరోసారి పార్లమెంటులో ప్రవేశపెడతామని రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. ఉమ్మడి పౌరస్మృతిపై రాజకీయ సంప్రదింపులు జరుపుతామని ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన చెప్పారు. అయితే గత ఏడాది ఆగస్టు 31న లా కమిషన్ సమర్పించిన కన్సల్టేషన్ పేపర్‌లో ప్రస్తుతానికి ఉమ్మడి పౌరస్మృతి అక్కరలేదని తెలిపింది. వివాహం, విడాకులు, భరణం,వివాహ అర్హత వయసు లాంటి వాటికి సంబంధించిన చట్టాల్లో మార్పులు చేయాలని సూచించింది.