స్పోర్ట్స్ కోడ్ ప్రకారం వారు అనర్హులు

SMTV Desk 2019-06-04 16:04:50  vijay sai reddy,

ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్, చైర్మన్ గా విజయసాయి రెడ్డిల ఎన్నిక చెల్లదంటూ స్పోర్ట్స్ కోడ్ ప్రకారం వారు అనర్హులని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘ కార్యదర్శి కేపీ రావు పేర్కొన్నారు. సోమవారం విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికలు జరగడంతో భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) గుర్తింపు రాదన్నారు. 2016లో ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్‌ను రిజిస్ట్రేషన్ చేశారని, ఆ రిజిస్ట్రేషన్ ప్రకారం రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని గౌరవ చైర్మన్‌గా నియమించడం చెల్లదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్‌లో రెండు వర్గాలకు సంబంధించిన వివాదం కోర్టులో ఉందని, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ఇరు వర్గాలకూ గుర్తింపును ఇవ్వలేదన్నారు.

ఒలంపిక్ సంఘం రెండు వర్గాలుగా ఏర్పడి అనేక ఒత్తిళ్లకు గురైందన్నారు. ఒలంపిక్ సంఘం ఎన్నికలను గుర్తింపు పొందిన సంఘాలతో నిర్వహించామని, గత ప్రభుత్వంలో గుర్తింపులేని సంఘాలకు ఎన్నికల్లో పాల్గొనే అవకాశం కల్పించారని చెప్పారు. ఒక వర్గానికి కార్యదర్శిగా చెప్పుకుంటున్న పురుషోత్తం, అధికార పార్టీ నాయకులను తప్పుదోవ పట్టించి క్రీడలకు మచ్చ తీసుకువస్తున్నారని విమర్శించారు. క్రీడాకారులను, క్రీడాసంఘాల ప్రతినిధులను సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. పురుషోత్తం ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘం కార్యదర్శి కాలేడని అన్నారు. వారం, పదిరోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ వివాదాన్ని పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చర్చలకు సంబంధించి ప్రభుత్వం నుండి ఫోన్ కోసం ఎదురు చూస్తానని, రాని పక్షంలో తాను కోర్టులోనే తెల్చుకుంటామని అన్నారు.