ప్రపంచకప్‌లో అసలైన మజా స్టార్ట్ ... ఉత్కంఠ పోరు లో పాక్ జయభేరి

SMTV Desk 2019-06-04 15:57:40  pakistan, England,

నాటింగ్‌హామ్: ప్రపంచకప్‌లో పాకిస్థాన్ బోణీ కొట్టింది. సోమవారం ఆతిథ్య ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 14 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 348 పరుగుల భారీ స్కోరును సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 334 పరుగులు చేసి కొద్ది తేడాతో ఓటమి పాలైంది. భారీ లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌కు రూట్, జోస్ బట్లర్‌లు శతకాలతో ఆదుకున్నారు. అయితే కీలక సమయంలో ఇద్దరు ఔట్ కావడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. క్లిష్టమైన లక్షంతో బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లండ్‌కు ప్రారంభంలోనే షాక్ తగిలింది. ఓపెనర్ జాసన్ రాయ్ 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. మరో ఓపెనర్ బైర్‌స్టో కొద్ది సేపు మెరుపులు మెరిపించాడు. అయితే 32 పరుగులు చేసి వెనుదిరిగాడు.

కొద్ది సేపటికే కెప్టెన్ మోర్గాన్ (9), బెన్‌స్టోక్స్ (13) కూడా పెవిలియన్ చేరారు. దీంతో ఇంగ్లండ్ 118 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యత జోస్ బట్లర్, రూట్ తమపై వేసుకున్నారు. ఇద్దరు పాక్ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ స్కోరును పరిగెత్తించారు. చెలరేగి ఆడిన బట్లర్ 76 బంతుల్లోనే 9 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 103 పరుగులు చేశాడు. కీలక ఇన్నింగ్స్ ఆడిన రూట్ కూడా శతకంతో మెరిశాడు. రూట్ 104 బంతుల్లోనే పది ఫోర్లు, సిక్స్‌తో 107 పరుగులు సాధించాడు. కీలక సమయంలో ఇద్దరు ఔట్ కావడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. అంతకుముందు ముందుగా బ్యాటింగ్ చేసిన పాక్‌ను సీనియర్ ఆటగాడు హఫీజ్ అండగా నిలిచాడు. హఫీజ్ 62 బంతుల్లోనే 84 పరుగులు చేశాడు. బాబర్ ఆజమ్ (63), కెప్టెన్ సర్ఫరాజ్ (58) కూడా అర్ధ సెంచరీలతో అలరించారు. దీంతో పాక్ భారీ స్కోరును నమోదు చేసింది.