ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలు నేడే

SMTV Desk 2019-06-04 15:55:23  MPTC, ZPTC,

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం కానుంది. వీటి కోసం రాష్ట్రవ్యాప్తంగా 978 లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రక్రియలో మొత్తం 35,529 మంది సిబ్బంది పాల్గొంటారు. ముందుగా పోలింగ్ కేంద్రాల వారీగా బ్యాలెట్ పేపర్లను విడదీసి కట్టలు కడతారు. ఒక్కో రౌండ్‌లో వెయ్యి చొప్పున రెండు రౌండ్లలో ఓట్లను లెక్కిస్తారు. మొదట ఎంపీటీసీ ఓట్లను ఆ తరువాత జెడ్పీటీసీ ఓట్లను లెక్కిస్తారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాల సరళి తెలియవచ్చు. ఈ ఎన్నికలలో మెజార్టీ స్థానాలు గెలుచుకొంటామని తెరాస, కాంగ్రెస్ పార్టీలు చాలా ధీమాగా ఉన్నాయి.

జూన్ 7న మండల పరిషత్, జూన్ 8న జిల్లా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నికలకు నిర్వహిస్తుంది. మొదట ప్రతీ మండల పరిషత్‌లోను మైనార్టీ వర్గానికి చెందిన ఒక వ్యక్తిని, జిల్లా పరిషత్‌లో ఇద్దరినీ తప్పనిసరిగా కో-ఆప్టెడ్ సభ్యులుగా ఎన్నుకోవాలి. ప్రస్తుత పాలకవర్గాల పదవీకాలం జూలై మొదటివారం వరకు ఉంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో పాలకవర్గం పదవీకాలం ఆగస్ట్ వరకు ఉంది. కనుక కొత్తగా ఎన్నికైనవారు అప్పటివరకు ఎదురుచూడక తప్పదు. కో-ఆప్టెడ్ సభ్యుల నియామకాలు, అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు ముగిసిన తరువాత పాలకవర్గాలు పదవీ భాద్యతలు చేపట్టవలసిన తేదీలను ప్రకటిస్తామని నాగిరెడ్డి చెప్పారు.