వైసీపీ తొలి ఎమ్మెల్సీ

SMTV Desk 2019-06-04 15:34:56  ycp, MLC, iqbal,

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచీ తనదైన శైలిలో జగన్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. తన మార్క్ స్టైల్లో పలు శాఖల అధికారులతో జగన్ స్వయంగా రివ్యూలు జరుపుతున్నారు. అయితే వైఎస్ జగన్ రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు గుంటూరులో ప్రభుత్వం తరఫున నిర్వహించిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఏపీలోని ముస్లింలందరికీ శుభాకాంక్షలు తెలిపిన ఆయన సార్వత్రిక ఎన్నికల్లో హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగి.. ఓటమిపాలైన వైసీపీ నేత ఇక్బాల్‌ను ఎమ్మెల్సీ చేస్తామని ప్రకటించారు. గుంటూరులోని పోలీసు పరేడ్‌ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌ విందులో ఆయన ఆసక్తికరంగా మాట్లాడారు. మొత్తం సార్వత్రిక ఎన్నికల్లో ఐదుగురు ముస్లింలకు టికెట్లు ఇచ్చామని... నలుగురు గెలిచారని.. హిందూపురంలో మాత్రం ఇక్బాల్ ఓడిపోయారు.. ఆయనను ఎమ్మెల్సీని చేస్తామని హామీ ఇచ్చారు సీఎం వైఎస్ జగన్.

అదేవిధంగా మాజీ సీఎం చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు జగన్. ఏపీ మాజీ సీఎం.. అప్పట్లో 23 మంది ఎమ్మెల్యేలను డబ్బులిచ్చి కొనుగోలు చేశారని.. దాంతో టీడీపీకి ఆ దేవుడు బాగానే మొట్టికాయలు వేశారని తెలిపారు. ఇదే 23వ తేదీన ఫలితాల్లో 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారని విమర్శించారు. అలాగే తాను నాన్న గారి పాలన గుర్తుకు వచ్చేలా ఏపీని పాలిస్తానని సీఎం జగన్ స్పష్టం చేశారు.