హైదరాబాద్ లో భీకర వర్షం

SMTV Desk 2019-06-04 15:34:09  Hyderbad, rains,

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. గత కొన్ని రోజులుగా భగ్గున మండిన భానుడు ఈరోజు సాయంత్రం వర్షంతో వాతావరణం అంతా శీతలమైంది. ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం 3గంటల సమయం వరకు తీవ్ర ఎండతో ఉక్కిరిబిక్కిరైన జనానికి ఈ సాయంత్రం కురిసిన భారీ వర్షం ఉపశమనం కలిగించిందనే చెప్పాలి. హైదరాబాద్‌ అంతా కారు మబ్బులు కమ్ముకోవడంతో నగరం చీకటిమయంగా మారింది. సాయంత్రం 5గంటలకే వాతావరణమంతా మబ్బులతో చిమ్మచీకటైంది.

కాగా నగరంలోని శేరిలింగంపల్లి, చందానగర్‌, మియాపూర్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, జీడిమెట్ల, ఈఎస్‌ఐ, ఎస్సార్‌నగర్‌, మైత్రివనం, మాదాపూర్‌, సోమాజిగూడ, బంజారాహిల్స్‌ వంటి ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురవగా.. ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, కుషాయిగూడ, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్‌ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. కాగా క్యుములో నింబస్‌ మేఘాల ప్రభావంతో గంటపాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే.