రాజకీయాల్లో కాలుష్యం ఎక్కువైంది.. అందుకే గుడ్ బై

SMTV Desk 2019-06-04 15:32:10  jc divakar reddy,

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన టీడీపీ నేతలు ధైర్యం కోల్పోతున్నారు. ఇప్పటికే కొందరు నామినేటెడ్ పదవులకు రాజీనామా చేశారు. కొందరు వైసీపీలోకి వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. చివరికి సీనియర్ నేతలు కూడా చేతులెత్తేస్తున్నారు. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశారు.

‘జగన్‌ మోహన్ రెడ్డి మావాడే. నేను అతనిపై రాజకీయ విమర్శలు చేశాను తప్పితే వ్యక్తిగత విమర్శలు చేయలేదు. ఎప్పుడైనా నోరి జారి ఉంటే ఉండొచ్చు. అంటే నేను పార్టీ మారుతున్నానని అనుకోవద్దు. రాజకీయాల్లో కాలుష్యం ఎక్కువైంది. అందుకే గుడ్ బై చెబుతున్నాను.. ఎన్నికల్లో గెలుపోటములు సహజం. అయితే పార్టీ ఓడినందుకు రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదు. నాకు పదవులపై కోరిక లేదు..’ అని అన్నారు. తన కొడుకు అతనికి ఇష్టం వచ్చిన పార్టీలో ఉంటాడని చెప్పారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో జేసీ దివాకర్ రెడ్డి పోటీ చేయలేదు. అతని కొడుకు పవన్ కుమార్ బరిలోకి దిగి, వైసీపీ చేతిలో ఓడిపోయాడు. జేసీ వైసీపీ, బీజేపీల్లో ఏదో ఒక పార్టీలో చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.