భారత హైకమిషనర్ ఏర్పాటు చేసిన విందులో అతిధులకు చేదు అనుభవం

SMTV Desk 2019-06-03 15:47:27  ifat dinner

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని భారత హైకమిషనర్ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు వచ్చిన అతిధులకు చేదు అనుభవం ఎదురైంది. స్థానిక భారతీయ హైకమిషనర్ శనివారం ఏర్పాటు చేసిన ఈ విందుకు వచ్చిన వారిని భద్రతా అధికారులు వారిని ప్రశ్నలతో వేధించడం, వివరాలపై ఆరా తీయడం వంటి చర్యలతో అవమానించారు. ఈ విందుకు పలువురు అధికారులను, జర్నలిస్టులను , అధికారులను ఆహ్వానించారు. ఈ లగ్జరీ హోటల్ చుట్టూ అసాధారణ రీతిలో భద్రతా వలయం ఉండటం, ఇఫ్తార్‌కు వెళ్లేందుకు వచ్చిన తమకు అటకాయింపులు ఎదురుకావడంతో వారంతా కంగుతిన్నారు. దీనితో చాలా ముంది లోపలికి వెళ్లకుండానే వెనుదిరిగి వెళ్లారు. భారత్, పాకిస్థాన్ మధ్య దౌత్య సంబంధాలు బెడిసికొడుతున్న ప్రస్తుత దశలో ఇక్కడి భారతీయ అధికారులు పలు రకాల అవమానాలకు గురవుతున్నారు. వారి కదలికలపై అప్రకటిత నిఘా పెట్టారు. తనను అనేక రకాలుగా ప్రశ్నించి, ఆహ్వాన పత్రాన్ని పదేపదే పరిశీలించి తరువాత లోపలికి పంపించారని ఒక జర్నలిస్టు చెప్పారు.హోటల్ లాబీలోకి తేలిగ్గా ఎవరిని పోనివ్వలేదని, గేటు వద్దనే కొందరిని నిలిపివేసి, ఇఫ్తార్ లేదు ఇక ఇంటికి పోవచ్చునని బెదిరించినంత పనిచేశారని, అయితే తాను వారితో వాదించడంతో వేరే గేటు నుంచి పోవాలని అన్నారని, అక్కడికి పోయిన తరువాత ప్రధాన గేట్ నుంచి వెళ్లాల్సి ఉంటుందని చెప్పారని, చాలా సేపటి వరకూ తనకు ఏమి జరుగుతుందో తెలియకుండా పోయిందన్నారు. అన్ని అడ్డంకులను తట్టుకుని తాను ఏదో విధంగా లోపలికి వెళ్లానని వివరించారు. ఇక ఇఫ్తార్‌కు ముందు హై కమిషనర్ బిసారియా సంక్షిప్తంగా మాట్లాడుతూ అతిధులు అంతా రాలేకపోయినట్లు తెలిసిందని, ఇక్కడికి వచ్చిన వారు కూడా నానా రకాల ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నారని తెలిసిందని, ఇందుకు క్షమించాలని కోరారు.