వరల్డ్‌కప్‌లో టీంఇండియా వేటకు ఆలస్యం....కారణం!

SMTV Desk 2019-06-03 15:38:56  icc world cup 2019, team india

ప్రపంచకప్ టోర్నీలో అన్ని జట్లు వరుసగా ఆడేస్తున్నాయి...ఒక్క టీంఇండియా తప్ప. టోర్నీ ప్రారంభమైన వారం రోజుల తరువాత అంటే బుధవారం.. దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌లో టీమిండియా మొదటి మ్యాచ్ ఆడనుంది. మరోవైపు దక్షిణాఫ్రికాకి అది టోర్నీలో మూడో మ్యాచ్ కానుంది. వాస్తవానికి ప్రపంచకప్‌లో భారత్ జట్టు లేట్ ఎంట్రీకి కారణం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ). ఐపీఎల్ 2019 సీజన్‌లో నెలన్నరపాటు అవిశ్రాంతంగా క్రికెట్ ఆడిన భారత్ ఆటగాళ్లకి కొంచెం రెస్ట్ కావాలని స్వయంగా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)ని బీసీసీఐ అభ్యర్థించింది. దీంతో.. భారత్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ని సవరించిన ఐసీసీ.. టోర్నీ మొదలైన వారం తర్వాత టీమిండియా తొలి మ్యాచ్ ఆడేలా రూపొందించింది. మార్చి 23న మొదలైన ఐపీఎల్ 2019 సీజన్ మే 12న ఫైనల్‌తో ముగిసిన విషయం తెలిసిందే. మూడేళ్ల క్రితం సుప్రీంకోర్టు నియమిత లోధా కమిటీ.. టీమిండియా ఆడే టోర్నీ, టోర్నీకి మధ్య కనీసం 15 రోజులు గ్యాప్ ఉండాలని సిఫారసు చేసింది. దీంతో.. ఐపీఎల్ 2019, ప్రపంచకప్‌ 2019 మధ్య ఈ వ్యవధి నియమాన్ని బీసీసీఐ పాటించినప్పటికీ.. ఆటగాళ్లకి మరింత విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశంతో ఐసీసీని అభ్యర్థించింది. ఈ బ్రేక్ టైమ్.. ఆటగాళ్ల ప్రాక్టీస్‌తో గాయపడిన క్రికెటర్లు ఫిట్‌నెస్ సాధించుకోవడానికి కూడా బాగా ఉపయోగపడింది. ఐపీఎల్‌లో గాయపడిన కేదార్ జాదవ్‌.. ఇప్పటికే పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు కనిపిస్తున్నాడు. ఆదివారం జిమ్‌లో టీమిండియా ఆటగాళ్లతో పోటాపోటీగా అతను కసరత్తులు చేశాడు.