నెలకు రూ.55తో రూ.3,000 పెన్షన్!

SMTV Desk 2019-06-03 15:33:11  central government,

కేంద్ర ప్రభుత్వం అసంఘటిత రంగ కార్మికుల ఆర్థిక భద్రత కోసం తాజాగా ప్రధాన్ మంత్రి శ్రమ్ యోగి మాన్‌ధన్ యోజన స్కీం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీంలో చేరిన వారికి నిర్ణీత వయసు దాటిన తర్వాత కేంద్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా పెన్షన్ చెల్లిస్తుంది. ఈ స్కీమ్ కార్మికులు, అసంఘటిత రంగంలోని పనిచేసే వారికి మాత్రమే వర్తిస్తుంది. పీయూష్ గోయెల్ 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్‌లో చేరాలంటే 18 నుంచి 40 ఏళ్ల వయసు ఉండాలి. నెలకు రూ.3,000 పెన్షన్ తీసుకోవచ్చు. ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. మీకు 18 ఏళ్లు ఉంటే నెలకు రూ.55 చెల్లించి రిటైర్మెంట్ (60 ఏళ్లు) తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ తీసుకోవచ్చు. నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించొచ్చు. ఎంత చెల్లించాలనేది వయసు ప్రాతిపదికన ఆధారపడి ఉంటుంది. మీరు చెల్లించే మొత్తానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా డబ్బులు చెల్లిస్తుంది. రెండు కలిపి మీ స్కీమ్‌లో జమవుతాయి. మీకు 18 ఏళ్లు ఉంటే నెలకు రూ.55 కట్టాలి. కేంద్ర ప్రభుత్వం కూడా రూ.55 జమ చేస్తుంది. అదే మీకు 25 ఏళ్ల ఉంటే నెలకు రూ.80 చెల్లించాలి. 30 ఏళ్ల ఉంటే రూ.105, 35 ఏళ్ల ఉంటే రూ.150 చెల్లించాలి.