ఏపీకి కేటాయించిన భవనాలన్నింటినీ తిరిగి తెలంగాణకు

SMTV Desk 2019-06-03 15:16:54  telangana, ap

ప్రస్తుత తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అయిన హైదరాబాద్ లో ఉన్న ఏపీ రాష్ట్రానికి చెందిన పరిపాలనా భవనాలు తెలంగాణకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఉమ్మడి రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్. నిజానికి రాష్ట్ర విభజన సమయంలో రెండు రాష్ట్రాలకు సమానంగా ప్రభుత్వ భవనాలను కేటాయించారు. అయితే ఓటుకు నోటు కేసు తరువాత అమరావతి నుండి పాలన నడుస్తున్నందున హైదరాబాద్లో భవనాలను ఏపీ ప్రభుత్వం వాడడం లేదు. కానీ విద్యుత్ బిల్లులు, ఇతర పన్నులను మాత్రం చెల్లిస్తూ వస్తోంది. అయితే భవనాలను వాడకపోవడం వలన భవనాలు పాడవుతున్నాయని తెలంగాణ కేబినెట్ అంతా కలిసి గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. ఏపీ పోలీస్ విభాగానికి ఒక భవనం కేటాయించాలని, ఇతర కార్యాలయాల కోసం మరో భవనం కేటాయించాలని తెలంగాణ మంత్రివర్గం కోరింది. మంత్రివర్గ విజ్ఞప్తి మేరకు గవర్నర్ భవనాలను తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలా ఈ ఉత్తరువు లు జారీ చేయడం ద్వారా రెండు రాష్ట్రాల మధ్య సమస్యల పురస్కారం దిశగా తొలి అడుగు పడిందని అంటున్నారు విశ్లేషకులు. హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలన్నింటినీ తిరిగి తెలంగాణకు అప్పగించడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వం కార్యకలాపాలన్నీ అమరావతి నుండే జరుగుతున్నందున హైదరాబాద్ లో ఏపీకి కేటాయించిన భవనాలు ఖాళీగా ఉన్నాయనీ ఆయన అన్నారు. ఖాళీగా ఉన్న భవనాలను ఉపయోగంలోకి తీసుకురావాలనే ఆలోచన ఉత్తమమని ఆయన అన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా ప్రయోజనాలే పరమావధిగా, స్నేహభావంతో ముందడుగు వేయడం శుభపరిణామం అన్నారు. ప్రతీ అంశంలోనూ వాస్తవిక దృష్టితో ఆలోచించి, ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో రెండు ప్రభుత్వాలు పని చేస్తాయని ఆకాంక్షిస్తున్నామని చెప్పారు. అపరిష్కృత సమస్యలన్నీ సామరస్యపూర్వకంగా పరిష్కారం కావాలన్నదే తమ అభిమతం అన్నారు.