హాజీపూర్ వరుస హత్యల కేసు: ‘ఆధార్’కార్డుల కలకలం

SMTV Desk 2019-06-03 15:16:12  hazipur, Srinivas reddy,

హాజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని సిట్ అధికారులు ఆదివారం తమ కస్టడిలోకి తీసుకొని విచారణ చేపట్టారు. అతన్ని విచారించేందుకు రాచకొండ పోలీసులు నల్లగొండ జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా శనివారం పరిశీలించిన నల్లగొండ అదనపు జిల్లా జడ్జి ఎస్.వి.వి.ఎన్ రెడ్డి శనివారం 3 రోజులు కస్టడీకి అనుమతించడంతో ఆదివారం సిట్ అధికారులు వరంగల్ కేంద్ర కారాగారం నుండి తమ అదుపులోకి తీసుకోని విచారణ కొనసాగిస్తున్నట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ అధికారులు తెలిపారు. గతంలోను సిట్ అధికారులు శ్రీనివాస్‌రెడ్డిని వారం రోజుల పాటు విచారించిన సంగతి తెలిసిందే. నిందితుని నేర చరిత్రపై అధికారులు మరోసారి ఆరా తీయనున్నారు.

గతంలో వరుస హత్యలకు గురైన శ్రావణి, కల్పన, మనీషాలను పూడ్చిపెట్టిన భావిలోనే మరో రెండు శవాలు ఉన్నట్లు ఊహాగానాలు వెల్లువెత్తున్నాయి. గతంలో శ్రీనివాస్ రెడ్డితో పాటు లిఫ్ట్ మెకానిక్‌గా పనిచేసే దంపతులను హతమార్చి మర్రిబావిలోనే పూడ్చి పెట్టి నట్లు గ్రామంలో చర్చించుకుంటున్నారు. దీనితో నేరస్థుని నేర చరిత్రతో పాటు నిందితుడు పనిచేసిన ప్రదేశాల్లో ఏమైనా నేరాలకు పాల్పడి ఉండొచ్చా అనే కోణంలోనూ విచారణ కొనసాగనుంది. అలాగే శ్రావణి, కల్పన, మనీషాలను హత్య చేసి బావిలో పాతిపెట్టే సమయంలో శ్రీనివాస్ రెడ్డికి ఎవ్వరైనా సహకరించారా అనే అనుమానాలపై కూడా వివరాలను సేకరించినట్లు సమాచారం.

గత నాలుగు నెలలక్రితం నిందితుడు సైకో శ్రీనివాస్‌రెడ్డి చేతిలో అత్యాచారాలాకు గురై, వరుస హత్యలకు గురైన అమ్మాయిలతో పాటు మరో అమ్మాయికి సంబందించి ఆధార్ కార్డు సెల్ ఫోన్‌లు బొమ్మలరామారం మండలంలోని తుంకుంట పరిధిలో ఆదివారం లభ్యమైనట్ల్లు గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. పోలీసులకు లభ్యమైన ఆధార్ కార్డు సెల్ ఫోన్‌లు గతంలో వరుస హత్యలకు గురైనా అమ్మాయిలదేనా? లేదా ఇంకేమైన కొత్త అమ్మాయిలు హత్యలకు గురయ్యారా? అనే అనుమాణాలు వెలువెత్తున్నాయి. దీనితో నేడు శ్రీనివాస్‌రెడ్డిని మరో సారి గ్రామంలోకి విచారణకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ శ్రీనివాస్‌రెడ్డిని గ్రామానికి తీసుకువస్తే ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తుతాయోనని ఆందోళనకు గురవుతున్నారు.