పాలస్తీనీయులకు ఇస్లామిక్‌ సదస్సు మద్దతు

SMTV Desk 2019-06-03 15:12:05  saudi arabia, makha masjid

మక్కా: శనివారం సౌదీఅరేబియాలోని మక్కాలో జరిగిన ఇస్లామిక్‌ సదస్సు పాలస్తీనీయులకు గట్టి మద్దతు ప్రకటించింది. ఇరాన్‌తో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగానే ఈ సదస్సు సౌదీ వైఖరిని గట్టిగా సమర్ధించింది. టెల్‌అవీవ్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని జెరూసలేంకు తరలించటం, గోలన్‌హైట్స్‌ ప్రాంతంపై ఇజ్రాయిల్‌ సార్వభౌమాధికారాన్ని గుర్తించటం వంటి అమెరికా వివాదాస్పద చర్యలను ఈ సదస్సు తీవ్రంగా ఖండించింది. జెరూస లేంలో దౌత్య కార్యాలయాలు ప్రారంభించిన దేశాలను బహిష్కరించాలని ఈ సదస్సు ఇస్లామిక్‌ దేశాల సదస్సు (ఒఐసి)సభ్యదేశాలకు విజ్ఞప్తి చేసింది. అయితే ఈ సదస్సుకు ఇరాన్‌, టర్కీ దేశాలు గైర్హాజరు కావటం విశేషం. పశ్చిమాసియాలో శాంతి పేరుతో అమెరికా తాను రూపొందించిన ఒప్పందానికి త్వరలో బహ్రెయిన్‌లో జరుగనున్న సదస్సులో ఆమోదం పొందేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఒఐసి దేశాలు ఈ ప్రకటన చేయటం గమనార్హం. డీల్‌ ఆఫ్‌ ది సెంచరీ అని ట్రంప్‌ సర్కారు చెబుతున్న ఈ శాంతి ఒప్పందం ముసాయిదాను పాలస్తీనియన్లు ఇప్పటికే తిరస్కరించిన విషయం తెలిసిందే.