ఏపీలో పిడుగులు పడే అవకాశం.. హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

SMTV Desk 2019-06-03 15:02:44  Ap, thunder,

ఏపీలోని విజయనగరం, చిత్తూరు జిల్లాలకు రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. విజయనగరం జిల్లాలోని గుమ్మలక్ష్మీపురం, మక్కువ, కొమరాడ, పార్వతీపురం, సీతానగరం, సాలూరు, చితూర్తు జిల్లాలోని కుప్పం, గుడుపల్లె, శాంతిపురం, రామసముద్రం, పుంగనూరు, నగరి, పాకాల తదితర ప్రాంతాలలో ఈదురుగాలులతో కూడిన వర్షంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీచేసింది. ఈ హెచ్చరికలు వచ్చే సమయానికే విజయనగరం జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జిల్లాలోని బొండపల్లి, కొమరాడ, మెంటాడలో ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. ఇక మరోపక్క ప్రకాశం జిల్లాలో పలు చోట్ల వీస్తున్న ఈదురుగాలులకు ప్రజలు వణికిపోతున్నారు. జిల్లాలోని పుల్లల చెరువు మండలంలో పెనుగాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో గాజుల పాలెం గ్రామంలో పలు తాటాకు, రేకుల ఇళ్ల పైకప్పులు కూడా ఎగిరి పోయాయి. మండల వ్యాప్తంగా వీస్తున్న ఈ ఈదురుగాలులకు ప్రజలు వణికిపోతున్నారు.