అమెరికాకు హెచ్చరికలు

SMTV Desk 2019-06-03 14:57:58  china, america

సింగపూర్‌: చైనా మరోసారి అమెరికాను హెచ్చరించింది. తమ ఆత్మరక్షణా సామర్థ్యాన్ని తక్కువ అంచనా వేయొద్దు అని తాజాగా అమెరికాకు చైనా హెచ్చరికలు జారీ చేసింది. చైనాతో ప్రాంతీయ సుస్థిరతకు ముప్పువుందంటూ అమెరికా రక్షణమంత్రి పాట్రిక్‌ షనాహన్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిఒ మండిపడ్డ చైనా రక్షణ మంత్రి వీఫెంఘీ ఈ హెచ్చరిక చేశారు. ఇరుదేశాల మధ్య అనూహ్యరీతిలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరువురు మంత్రులు శుక్రవారం భేటీ అయి భద్రతా పరమైన అంశాలపై చర్చించారు. అమెరికా నావికాస్వేచ్ఛ పేరిట తైవాన్‌ జలసంధిగుండా పలుమార్లు నౌకలను పంపుతుండటాన్ని తీవ్రంగా ఖండించిన చైనా తాము అనుసరిస్తున్న వన్‌చైనా విధానాన్ని గౌరవించాలని సూచించింది. తైవాన్‌కు సంబంధించిన అంశాలపై అమెరికా ఇటీవలి కాలంలో తీసుకుంటున్న చర్యలను తాము తీవ్రంగా వ్యతిరేకించామని చైనా రక్షణ మంత్రిత్వశాఖ ప్రతినిధి సీనియర్‌ కల్నల్‌ వుకైన్‌ భేటీ అనంతరం మీడియాకు చెప్పారు. దేశ జాతీయ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకునే విషయంలో తమ సామర్ధ్యాన్ని తక్కువగా అంచనా వేయవద్దని అమెరికాను హెచ్చరించినట్లు ఆయన చెప్పారు. అయితే ఈ వాదనను అమెరికా రక్షణ మంత్రి షనాహన్‌ తోసిపుచ్చినప్పటికీ పసిఫిక్‌ప్రాంతంలో ఇరుదేశాల సైనికాధికారులు కలిసి పనిచేసేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. షాంగ్రిలా భద్రతా సదస్సు నేపథ్యంలో ఇరువురు మంత్రులు దాదాపు 20 నిముషాలసేపు భేటీ అయ్యారు. ఇటీవలి కాలంలో చైనా-అమెరికా వాణిజ్యపోరుతో పసిఫిక్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు చెలరేగు తున్న నేపథ్యంలో ఈప్రాంతంలో ఎటువంటి పరిస్థితులనైనా ఎదు ర్కొనేందుకు సిద్ధంగా వుండాలని చైనా అధ్యక్షుడు సీ-జిన్‌పింగ్‌ తమ సైన్యానికి ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.