తెలంగాణ అన్నా, హైదరాబాద్ అన్నా ఎంత ద్వేషమో?... కిషన్ రెడ్డిపై ఒవైసీ ఆగ్రహం

SMTV Desk 2019-06-02 13:34:32  owaisi

హైదరాబాద్ ఉగ్రవాదుల అడ్డా అని కిషన్ రెడ్డి చేసినట్టుగా వస్తున్న కథనాలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. ఓ కేంద్ర సహాయమంత్రి నోట ఇలాంటి వ్యాఖ్యలు వినాల్సి వస్తుందనుకోలేదని, తెలంగాణ అన్నా, హైదరాబాద్ అన్నా ఎంత ద్వేషమో ఈ వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోందని మండిపడ్డారు. ఓ కేంద్ర సహాయమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు తగదని ఒవైసీ హితవు పలికారు.

"ముస్లింలను చూస్తే చాలు టెర్రరిస్టులంటూ తీసుకెళుతున్నారు. వీళ్లను మార్చలేం!" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ‌" నేనా సహాయమంత్రిని ఒకటే అడుగుతున్నాను, ఈ ఐదేళ్లలో ఎన్ఐఏ, ఐబీ, రా అధికారులు ఎన్నిసార్లు హైదరాబాద్ ను ఉగ్రవాదుల అడ్డా అని పేర్కొన్నారు? అలాంటప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత దురదృష్టకరం. హైదరాబాద్ ఎదగడం వీళ్లకు ఇష్టంలేనట్టుంది" అంటూ ట్వీట్ చేశారు.

అంతకుముందు, కిషన్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ, బెంగళూరు, భోపాల్ ఎక్కడ ఉగ్రదాడి జరిగినా దాని మూలాలు హైదరాబాద్ లోనే ఉంటున్నాయన్నారు. రాష్ట్ర పోలీసులు, ఎన్ఐఏ అధికారులు ప్రతి రెండుమూడు నెలలకోసారైనా హైదరాబాదులో ఉగ్రవాదులను అదుపులోకి తీసుకుంటున్నారని తెలిపారు.