జనాల డబ్బుతో జల్సా......ఫేక్ షేక్ కు 18 ఏళ్ల జైలు శిక్ష

SMTV Desk 2019-06-02 11:53:54  saudi

మోసపోయే వాళ్లు ఉన్నంత వరకు మోసం చేసేవారికి ఎలాంటి ఢోకా ఉండదనేది కాదనలేని వాస్తవం. తమ హంగు ఆర్భాటాలతో జనాలను నమ్మించి అందినకాడికి దోచేయడం మోసగాళ్లకు వెన్నతో పెట్టిన విద్య అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి ఇదే ఫార్మూలాను అనుసరించాడు. తనను తాను సౌదీ రాజ కుటుంబానికి చెందిన వాడిగా పరిచయం చేసుకొని గత మూడు దశాబ్దాలుగా జనాల నుంచి ఏకంగా 8 మిలియన్ డాలర్లు(రూ.55,66,36,800) దండుకున్నాడు.

వాటితో జల్సాలు చేసి చివరకు జైలు పాలయ్యాడు. వివరాల్లోకి వెళ్తే... ఆంథోనీ గిగ్నాక్(48) అనే వ్యక్తి తనను ఖలీద్ బిన్ ఆల్ సౌద్‌గా పరిచయం చేసుకొని తన చూట్టు ఓ ప్రత్యేకమైన లగ్జరీ ప్రపంచాన్నే సృష్టించుకున్నాడు. మిమామీలోని కాండో సమీపంలో గల ఫిషర్ ఐల్యాండ్‌లో నివాసం ఏర్పరుచుకొని ప్రత్యేకంగా రక్షక భటులు, అధికారులను సైతం ఏర్పాటు చేసుకున్నాడు.

నకిలీ లైసెన్స్‌తో ఫెరారీని నడుపుతున్నాడు. వేర్వేరు వర్తకాల పేరిట పెట్టుబడిదారుల నుంచి భారీగా పెట్టుబడులు పెట్టించాడు. పెట్టుబడిపెట్టిన వారిలో కొందరికి తన హుందా తనానికి తగినట్టుగా భారీగా బహుమతులు అందజేసేవాడు. గిగ్నాక్ రాజభోగాలు చూసిన పెట్టుబడుదారులు నిజంగానే అతడు రాజకుటుంబానికి చెందిన వాడేమోనని భావించి అతడి వర్తకాల్లో భారీగా డిపాజిట్లు పెట్టారు.

అలా వచ్చిన నగదును మనోడు ఖరీదైన బట్టలు, ప్రైవేట్ జెట్ రైడ్స్‌తో జల్సాలు చేసేవాడు. ఇలా జనాలను మోసం చేస్తూ హాయిగా జీవితం గడిపేస్తున్న గిగ్నాక్‌ 2017, నవంబర్‌లో అరెస్ట్ అయ్యాడు. అతడిపై ఎలక్ట్రానిక్ మోసం, గుర్తింపును దొంగలించడంతో సహా 18 నేరారోపణలు మోపబడ్డాయి. దీంతో న్యాయస్థానం గిగ్నాక్‌కు 18 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.