నిరుద్యోగిత రేటు 6.1.. 45 ఏళ్లలో ఇదే తొలిసారి

SMTV Desk 2019-06-01 14:12:32  un employement,

న్యూఢిల్లీ: ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్‌‌లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 5.8 శాతానికి పడిపోయింది. గత ఏడాది అక్టోబరు–డిసెంబరు క్వార్టర్‌‌లో ఇది 6.6 శాతం నమోదయింది. గత ఐదేళ్లలో ఇదే అత్యంత తక్కువ జీడీపీ కావడం గమనార్హం సాగు, ఉత్పత్తిరంగాల్లో మందగమనం వల్లే జీడీపీ రేటు తగ్గిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ క్వార్టర్‌‌లో ఏడుశాతం వృద్ధి నమోదవుతుందని మొదట అంచనా వేయగా, తదనంతరం దీనిని 6.8 శాతానికి తగ్గించారు. ఈ నేపథ్యంలో కొత్త ఆర్థికమంత్రి ఆర్థికవ్యవస్థను పరుగులు పెట్టించడానికి వెంటనే రంగంలోకి దిగాలని ఆర్థికవేత్తలు సూచిస్తున్నారు. జీడీపీకితోడు పారిశ్రామిక గణాంకాలు కూడా నిరాశాజనకంగా ఉన్నాయి. ఫ్యాక్టరీ ఔట్‌‌పుట్‌‌ 21 నెలల తరువాత ప్రతికూల పథంలోకి ప్రవేశించింది. ఈ ఏడాది ఏప్రిల్‌‌లో ఉత్పత్తి, సేవల పీఎంఐ 51.6 శాతం, 51 శాతం నమోదయ్యాయి. గత సెప్టెంబరు తరువాత ఇంత తక్కువ నమోదు కావడం ఇదే తొలిసారి.

2017–18 ఆర్థిక సంవత్సరం నిరుద్యోగిత రేటు 6.1 శాతానికి పెరిగిందని కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.8 శాతంగా నమోదయిందని కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌‌ఓ) ప్రకటించింది. అంతకుముందు సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 7.2 శాతం ఉండటం విశేషం. నిరుద్యోగిత రేటు 6.1 శాతానికి చేరడం గత 45 ఏళ్లలో ఇదే తొలిసారని తెలిపింది. అయితే కార్మిక మంత్రిత్వశాఖ తాజా లెక్కల ప్రకారం పట్టణాల్లో 7.8 శాతం, గ్రామాల్లో 5.3 శాతం నిరుద్యోగిత రేటు నమోదయింది. ఇది పురుషుల్లో 6.2 శాతం, మహిళల్లో 5.7 శాతం ఉంది. ఇదిలా ఉంటే జీడీపీ తగ్గడంపై కేంద్ర ఆర్థిక వ్యవహారాలశాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్‌‌ మాట్లాడుతూ ఈ పరిస్థితి తాత్కాలికం మాత్రమేనని, తిరిగి గాడినపడతామని అన్నారు.