ప్రజల ముఖాల్లో సంతోషం.....బంగారు తెలంగాణ సాధ్యం

SMTV Desk 2019-06-01 14:02:21  pocharam srinivas

భారతదేశానికి రాజ్యాంగం పవిత్ర వంతమైన గ్రంధం అని శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టర్, జేసీ క్యాంపు కార్యాలయాలను పోచారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పోచారం మాట్లాడుతూ.. మెరుగైన సేవలు అందించాలని సుమారు రూ. 50 కోట్ల రూపాయలతో జిల్లా కలెక్టర్ కాంప్లెక్స్, 40 కోట్ల రూపాయలతో ఎస్పీ కాంప్లెక్స్ భవనాల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. నిర్మాణాలు పూర్తయిన తర్వాత ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఉంటుందని పోచారం స్పష్టం చేశారు.

ప్రజాప్రతినిధులు పదవుల కోసం కాకుండా ప్రజలకోసం పనిచేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ప్రజలే ప్రభుత్వం.. ప్రజలు లేనిదే ప్రభుత్వం లేదన్నారు. ముఖ్యమంత్రి కొత్త జిల్లాల్లో బంగారు తెలంగాణ స్వప్నం కామారెడ్డి జిల్లా నుండే ప్రారంభం కావాలని పోచారం పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల ముఖాల్లో సంతోషం కనిపించినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బీబీ పాటిల్, జడ్పీ చైర్మన్ దాఫేదార్ రాజు, ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మంతు షిండే, నల్లమడుగు సురేందర్, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జేసీ యాది రెడ్డి, ఎస్పీ శ్వేతా రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సుష్మా వెంకట్ తదితరులు పాల్గొన్నారు.