ధోనీ చేసే ఫీల్డింగ్‌‌ మార్పులు చాలా ఉపయోగం : కోహ్లీ

SMTV Desk 2019-06-01 13:16:41  Kohli, Dhoni,

ఫైనల్‌‌ కంటే ముందు వరల్డ్‌‌కప్‌‌లో చాలా మ్యాచ్‌‌లు ఆడాల్సి ఉందని టీమిండియా కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ అన్నాడు. ఇప్పుడిప్పుడే టైటిల్‌‌ పోరు గురించి ఆలోచించడం సరైంది కాదన్నాడు. ప్రస్తుతం ఒక్కో మ్యాచ్‌‌పై దృష్టిసారిస్తామని స్పష్టం చేశాడు. ‘మేం ఫైనల్‌‌కు చేరాలంటే ముందు 9 మ్యాచ్‌‌లు ఆడాలి. ఆ తర్వాత సెమీస్‌‌లోనూ సత్తా చాటాలి. ప్రస్తుతానికైతే నాలుగు పెద్ద మ్యాచ్‌‌లతో లీగ్‌‌ను మొదలుపెడుతున్నాం. ముందుగా ఈ సవాలును అధిగమించాలి. ఇందులో గెలిస్తే రాబోయే మ్యాచ్‌‌ల్లో ఒత్తిడి తగ్గుతుంది. ఇప్పుడున్న టీమ్‌‌ అన్ని విభాగాల్లో సమతూకంగా ఉంది. విజయ్‌‌ శంకర్‌‌ ఉండటం వల్ల ప్రత్యామ్నాయాలు పెరిగాయి. అతని రాకతో బ్యాటింగ్‌‌, ఫీల్డింగ్‌‌, బౌలింగ్‌‌లో మాకు అదనపు బలం చేకూరింది. ఎవరు ఏయే స్థానాల్లో ఆడాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పిచ్‌‌, వాతావరణ పరిస్థితులను బట్టి లైనప్‌‌పై ఓ అంచనాకు వస్తాం. బౌలింగ్‌‌లో పేస్‌‌ బలంతో పాటు స్పిన్నర్లు కూడా సూపర్‌‌ ఫామ్‌‌లో ఉన్నారు. కచ్చితంగా వీళ్లు టోర్నీలో ప్రభావం చూపుతారు’ అని విరాట్ పేర్కొన్నాడు.

మహీ జట్టులో ఉండటం చాలా పెద్ద ప్రభావం చూపుతుందన్నాడు. మ్యాచ్‌‌ను అతను అర్థం చేసుకున్నంతగా ఇంకెవరూ అవగాహన చేసుకోలేరని కితాబిచ్చాడు. టీమ్‌‌లో అతను ఉంటే ప్రతి ఒక్కరికి సాయం అందుతుందన్నాడు. కీపర్‌‌ స్థానంలో ఉండి మ్యాచ్‌‌ను పరిశీలిస్తాడు కాబట్టి.. చివరి 15 ఓవర్లలో ఫీల్డింగ్‌‌ మొహరింపుపై అతనే నిర్ణయాలు తీసుకుంటాడన్నాడు. ధోనీ చేసే ఫీల్డింగ్‌‌ మార్పులు చాలా ఉపకరిస్తాయని చెప్పిన కోహ్లీ.. తమ ఇద్దరి మధ్య పరస్పర గౌరవం, నమ్మకం ఉందని తెలిపాడు.