రష్యాతో భారత డీల్ పై అమెరికా తీవ్ర ఆగ్రహం!

SMTV Desk 2019-06-01 13:16:00  russia

రష్యా నుంచి లాంగ్ రేంజ్ ఎస్-400 మిసైళ్లను కొనుగోలు చేసేందుకు ఇండియా కుదుర్చుకున్న డీల్ తో తమతో కొనసాగుతున్న రక్షణ బంధం ప్రమాదంలో పడిందని అమెరికా హెచ్చరికలు పంపింది. రష్యా తయారు చేసిన అత్యాధునిక సర్ఫేస్ టూ ఎయిర్ మిసైల్ గా ఎస్-400 పేరు తెచ్చుకోగా, చైనా ఇప్పటికే వీటిని కొనుగోలు చేసింది. దీంతో ఓ మిత్రదేశంగా ఉన్న రష్యా నుంచి వీటిని సమీకరించేందుకు నిర్ణయించుకున్న ఇండియా, ఈ క్షిపణుల కొనుగోలుకు ఐదేళ్ల క్రితమే తొలి అడుగులు పడగా, గత సంవత్సరం అక్టోబర్ లో డీల్ కుదిరింది. అప్పటి నుంచి ఆగ్రహంతో ఉన్న అమెరికా, మిసైళ్లు ఇండియాకు చేరే సమయం దగ్గర పడటంతో మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.

కాగా, దాదాపు రూ. 3,500 కోట్లు ( 5 బిలియన్ డాలర్లు) విలువైన ఈ డీల్ లో భాగంగా, త్వరలోనే మిసైళ్లు ఇండియాకు రానున్నాయి. సరిహద్దు సమస్యల పేరిట వీటిని సమకూర్చుకుంటున్నట్టు ఇండియా చెబుతుండగా, సరిహద్దుల రక్షణకు ఇంతటి లాంగ్ రేంజ్ మిసైళ్లు అవసరం లేదన్నది అమెరికా వాదన. ఈ డీల్ కొనసాగితే ఇండియాపై ఆంక్షలు విధించక తప్పదని కూడా ట్రంప్ సర్కారు అంటోంది.